కూటమి సీట్లు.. మాజీ ప్రధానితో భేటీ.. చంద్రబాబు బిజీ బిజీ

 

బీజేపీయేతర శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్, మాయావతి, ములాయం, అఖిలేష్‌, ఫ‌రూఖ్ అబ్దుల్లా వంటి నేతలను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు బెంగుళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో ఈ మేరకు కీలక భేటి నిర్వహించనున్నారు. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా సమావేశంకానున్నారు. మహాకూటమిలో టీటీడీపీ కేటాయించిన సీట్ల వివరాలను సీఎంకు వెల్లడించనున్నారు. టీడీపీ పోటీ చేయనున్న సీట్లు, అభ్యర్థులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు మధాహ్నం మూడు గంటలకు బెంగూళురు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేలా కార్యచరణను సిద్దంచేసుకున్నారు. అదేవిధంగా ఇంకా ఎవ‌రెవ‌ర‌ని క‌ల‌వాలి అనేదానిపైన చంద్రబాబు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.