టీఆర్ఎస్ లోకి వంటేరు..ముహూర్తం ఖరారు

 

కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. నిన్నా మొన్నటి వరకు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని చెడామడా తిట్టిన వంటేరు హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కటానికి సిద్దపడుతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. రేపు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో వంటేరు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయారు. మొదటిసారి 17వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే మూడు రెట్లకు పైగా మెజార్టీతో ఓటమి చవిచూశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంటేరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఓడించాలంటూ మంత్రి హరీశ్ రావు తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ నాయకులు తనపై దాడులు చేస్తున్నారని, ప్రాణ భయం ఉందని ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వంటేరు గులాబీ పార్టీలో చేరతారనే వార్తలు సంచలనంగా మారాయి. చేరికకు సంబంధించి ఆయన తన అనుచరులు, అభిమానులతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. కేసీఆర్, హరీశ్ రావుతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి వంటేరు పార్టీ మారుతున్నట్లు ప్రకటించి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడిని మరోసారి నిజం చేశారు.