వల్లభనేని వంశీ మెడకు నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఉచ్చు!

భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ మొదలయ్యామో అక్కడికే రాక తప్పదని ఇప్పటికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అర్ధమై ఉంటుంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. వైసీపీ అధికారంలోకి రాగానే వంశీకి కేసుల భయం పట్టుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరితే ఇక ఆ కేసుల భయం ఉండదని పార్టీ మారిపోయారు. ఇక్కడే ఆయన భూమి గుండ్రంగా కాదు బల్ల పరుపుగా ఉంటుందని భావించారు. మరెన్నడూ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు.. జగనే శాశ్వత సీఎం, కనుక తనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఎప్పటికీ తేలదని నమ్మారు.

అందుకే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పు కున్నారు. అంతేనా.. ఇన్నాళ్లూ ఆశ్రయం ఇచ్చిన పార్టీపై ఇష్టారీతిన ప్రేలాపనలు పేలారు. తెలుగు దేశం అధినేత సతీమణి భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా నిలబడిన గన్నవరం తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ మారిపోయింది. జగన్ పార్టీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది అని భావించారు. జగన్ సీఎం పదవి పోయింది. ఓటమి అనేదే లేకుండా తాను గెలుస్తూ వస్తున్న గన్నవరం అసెంబ్లీ స్థానంలో వల్లభనేని వంశీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. భూమి గుండ్రంగానే ఉందని, ఉంటుందని ఇప్పుడు వంశీకి బోధపడి ఉంటుంది. ఎందుకంటే ఏ కేసు భయంతో అయితే  వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడాడో.. అదే కేసు ఇప్పుడు ఆయనకు కటకటాల భయాన్ని చూపెడుతోంది.

బాపులపాడులో నకిలీ ఇల్ల పట్టాలు తయారు చేయించి పంచిన   కేసులో వల్లభనేని వంశీ ముద్దాయి.  2019 ఎన్నికలలో  వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులో తనకు జైలు తప్పదన్న భయంతో ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన భావించినట్లే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు పట్టాలెక్కలేదు. ఆ కృతజ్ణతో లేక వైసీపీ అధినాయకత్వం ఒత్తిడో తెలియదు కానీ వంశీ వైసీపీ పంచన చేరి తెలుగుదేశం నేతలపై ఇష్టాను సారం వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ ను వేధించారు. ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు వంశీపై కేసు నమోదు అవ్వనుంది. వైసీపీ నుంచి అండ లభించే అవకాశాలు లేశమాత్రంగానైనా కనిపించడం లేదు. దీంతో వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడగా మారిపోయింది. కటకటాలు లెక్కిండానికి రోజులు లెక్కపెట్టుకోవడమే మిగిలింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News