లక్నోని ఏలే... లక్కీ బీజేపి సీఎం ఎవరు? వీళ్లలో ఒకరే!

మరి కొన్ని గంటల్లో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పేరుకే అయిదు రాష్ట్రాలు అంటున్నాం కాని అసలు దృష్టి, చర్చ అంతా యూపీపైనే! నాలుగు వందల సీట్ల అతి పెద్ద అసెంబ్లీ లక్నోలోనే వుంది. అక్కడి సీఎం పీఠం బీజేపికి దక్కితే ఇక దేశంలో కాషాయ విప్లవాన్ని ఎవ్వరూ ఆపలేరని విశ్లేషకుల అంచనా! అందుకు తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ ఉత్తర్ ప్రదేశ్ లో కమలం వికసిస్తుందనే చెబుతున్నాయి. ఒకట్రెండు సర్వేలైతే స్వంతంగా బంపర్ మెజార్టీ దక్కుతుందని తేల్చేశాయి! ఫైనల్ సీన్ ఏంటో మార్చ్ పదకొండున మాత్రమే తెలుస్తుంది. కాని, అప్పుడే అవసరం అయితే మాయవతితో కలిసైనా ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అని అఖిలేష్ అన్నాడంటే... ఎవరు గెలవబోతున్నారో మనమూ చెప్పేయవచ్చు! ఒకవేళ బీజేపీదే ఉత్తర్ ప్రదేశ్ పీఠం అయితే దాని మీద కూర్చోబోయేది ఎవరు?

 


ఉత్తర్ ప్రదేశ్ లో కమలదళానికి ఉత్తమ నాయకత్వం కొదవలేదు. ఇప్పుడు అదే పెద్ద సస్పెన్స్ కి కారణమైంది! స్వంతంగా మెజార్టీ వచ్చి బీజేపి ప్రభ్వుతం ఏర్పాటు చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చాలా మందే రేస్ లో వున్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది యూపీ బీజేపి చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య. ఇంతవరకూ సైలెంట్ గా రాష్ట్ర బీజేపీని క్షేత్రస్థాయిలో బలంగా మార్చిన ఈయన బీసీ వర్గం వాడు కావటం మరోక ప్లస్! యూపీలో యాదవులు కాని బీసీలందరూ ఈయన్ని సీఎంని చేస్తే కమలం వెంట చాలా కాలం నిలిచే అవకాశం వుంది. అయితే, చాలా సింపుల్ మనిషైన మౌర్య ఇప్పటి వరకూ పాలన అనుభవం వున్నవాడు మాత్రం కాదు. 

 


కేశవ్ ప్రసాద్ మౌర్య తరువాత బలంగా వినిపిస్తోన్న పేరు రాజ్ నాథ్ సింగ్! ఈయనకు లక్నో అంసెబ్లీ, సెక్రటేరియట్ కొత్త కాదు. 2002లో కూడా ఆయన యూపీ సీఎంగా వున్నాడు. తరువాత అధికారం కోల్పోయిన బీజేపి 15ఏళ్ల తరువాత అధికారం చేపడితే మళ్లీ పాత కాపునే తెచ్చి పెడుతుందా? చెప్పే అవకాశాలు ఇప్పుడే లేవు. ఎందుకంటే, కేంద్ర హోం మంత్రిగా కూడా రాజ్ నాథ్ మోదీ వద్ద మంచి మార్కులే వేయించుకున్నారు. ఢిల్లీ నుంచి లక్నో పంపుతారో లేదో చూడాలి!
దేశంలో ఎక్కడా లేనంత బలం బ్రాహ్మణులకు వుండేది యూపీలోనే! వాళ్లు అక్కడ దాదాపు ఇరవై అయిదు శాతం ఓటు బ్యాంకు. అందుకే, అగ్రవర్ణాల అభిమాన పార్టీ అయినా బీజేపీ బ్రాహ్మణుడ్ని సీఎం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే జరిగితే మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి అవ్వొచ్చు.

 

 

ఈయన ఇప్పుడు యూపీ నుంచే ఎంపీ. కేంద్ర  క్యాబినేట్లో మంత్రి కూడా. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఐఐటీలో చదువుకున్న సిన్హా మంచి కార్య దక్షుడు. తూర్పు యూపీలో భారీగా పాలోయింగ్ వుంది. బీజేపికి మొదట్నుంచీ వరంగా వుంటూ వస్తోన్న హిందూత్వ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటే గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని, కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ ఈ సీనియర్ నేత సీఎం అయితే ముందు ముందు వివాదాలు భారీగా చెలరేగే సూచనలున్నాయి. అలాంటి రిస్క్ బీజేపి ఎంత వరకూ చేస్తుందనేది డౌటే. ప్రతిపక్షాలు ప్రతీ చిన్నదాన్ని ఆదిత్యనాథ్ ఇమేజ్ ను అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేసే అవకాశాలున్నాయి. 

 


ఎలాగైనా యూపీ పైన పట్టు సాధిద్ధామని ప్రయత్నించి ఓడిన గాంధీ రాహుల్. అయితే, బీజేపి గెలిస్తే కూడా గాంధీ సీఎం అయ్యే ఛాన్స్ వుంది. కాని, ఆయన మేనకా గాంధీ కొడుకు వరూణ్! మంచి ఫైర్ బ్రాండ్ యువనేతగా పేరున్న ఆయన సీఎం అవ్వటం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కాని, 2016లో ఆయన అనుచరులు వరూణే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు వేసి నానా హంగామా చేశారు. అప్పట్నుంచీ బీజేపి అతడ్ని పక్కన పెడుతూ వస్తోంది. మరి ఈ కాషాయ గాంధీకి సీఎం కుర్చీ దక్కుతుందా? తుది ఫలితాలు వచ్చాకే తెలిసేది!