ఉండవల్లి, జైపాల్ రెడ్డి, ఓ రాష్ట్ర విభజన బిల్లు!

దేశంలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన కాంగ్రెస్ మార్కు కాంగ్రెస్ దే! ఆ పార్టీలో నేతలు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అధికారంలో వున్నా లేకపోయినా కాంగ్రస్ నేతల తీరు మాత్రం మారదు. ఒకే పార్టీలో వుంటూ ఒకర్నొకరు వ్యతిరేకిస్తారు. కాదంటే పబ్లిగ్గా తిట్టుకుంటారు కూడా. అదేమంటే అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు!. తెలంగాణ ఏర్పాటు జరిగి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఇచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతూ వుంటారు. తెచ్చింది మేమే అంటూ టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రచారం చేసుకుంటూ వుంటారు. కాని, ఎన్నికల్లో జనం టీఆర్ఎస్ నే నమ్మినట్టు క్లియర్ అయిపోయింది. కాంగ్రెస్ ను టీ అసెంబ్లీలో ప్రతిపక్షానికే పరిమితం చేశారు. అటు ఆంద్రా అంసెబ్లీలో అయితే మరీ దారుణం. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను నవ్యాంధ్ర అసెంబ్లీలో కాలేపెట్టనివ్వలేదు! సమీప భవిష్యత్ లో అలాంటి ఉద్దేశ్యం కూడా జనానికి వున్నట్టు కనిపించటం లేదు!

 

రాష్ట్ర విభజన మంటను రాజేసి చివరకు తన ఒళ్లు తానే కాల్చుకున్న కాంగ్రెస్ ఇప్పటికీ తెలివి తెచ్చుకున్నట్టు కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు అనవసర చర్చలకు తెర తీస్తూ కాంగ్రెస్ మార్కు కయ్యానికి కాలు దువ్వుతున్నారు! హస్తం పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లే ఇందుకు కారణం!. ఉండవల్లి ఈ మధ్య విభజన కథ గురించి ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే కదా… దాంట్లో ఆయన ఏకంగా తెలంగాణ ఏర్పాటు బిల్లే సభలో పాస్ కాలేదని ఆరోపించారు. పార్లమెంట్లో గందరగోళం చెలరేగటంతో ఓటింగ్ కాలేదని ఆయన అంటున్నారు. కాబట్టి తెలంగాణ ఏర్పాటుకు సభ అమోదం అధికారికంగా రాలేదని ఉండవల్లి అభిప్రాయం.

 

ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకే చెందిన జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. బిల్ పెట్టడంపై, దాన్ని పాస్ చేయించటంపై  అందరూ చేతులెత్తేస్తే తానే రంగంలోకి దిగానని ఆయన చెప్పారు. తన పార్టీ మంత్రి కమల్ నాథ్, బీజేపి నేత సుష్మా స్వరాజ్ ల మధ్య సయోధ్య కుదిర్చి బిల్ పెట్టించానని జైపాల్ చెప్పుకొచ్చారు. ఓటింగ్ కి కుదరదు కాబట్టే హెడ్ కౌంట్ పద్ధతి ద్వారా బిల్ అమోదం చేయించమని స్పీకర్ కి కూడా చెప్పానని ఆయన అన్నారు! అంతే కాదు, ఓటింగ్, బిల్ అమోదం పొందటం వంటి విషయాల్లో కేసీఆర్ కు ఎలా ప్రమేయం లేదని కూడా తేల్చేశారు!

 

ఇంతకీ తెలంగాణ బిల్ పాసైందా? లేదా? తెలుగు ప్రాంతం రెండుగా విడిపోయి రెండున్నరేళ్లు గడిచిపోయాక ఈ ప్రశ్నకి అసలు వాల్యూనే లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఎవ్వరు మాత్రం చేసేదేముంది? తిరిగి రెండు రాష్ట్రాల్ని కలిపేసి సమైక్యాంధ్ర తీసుకువస్తారా? అలా తెచ్చే వీర సాహసం ఎవరు చేస్తారు? అయినా అదసలు సాధ్యమా? వాంఛనీయమా? ఎన్నో ప్రశ్నలు… సమాధానాలే లేని ప్రశ్నలకి జవాబులు వెదుక్కునే స్థితి తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి, జైపాల్ రెడ్డి! అందుకే, ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలుగాని, కేసీఆర్ గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వింత కొట్లాటలు కాంగ్రెసోళ్లకు మామూలే అనుకుని సైలెంట్ గా వుండిపోయారు! జనం ఉద్దేశ్యం కూడా అలానే వున్నట్టు కనిపిస్తోంది…