బంగారం నిల్వలపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం...

 

బంగారమంటే భారతీయులకు ప్రాణం. ప్రతి ఏటా భారత్ తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న బంగారం బ్యాంకు లాకర్లలో మూలుగుతోంది. బంగారం దిగుమతి కోసం విలువైన విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే కొత్త గోల్డ్ పాలసీని తీసుకొస్తోంది కేంద్రం. జనం రహస్యంగా దాచుకున్న బంగారం లెక్కలు స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా దాచిన బంగారాన్ని పన్నులు చెల్లించేందుకు ప్రజలు అవకాశమిస్తారు.

ప్రధాని కార్యాలయం ఆర్థికశాఖ ఈ పథకానికి తుది మెదుగులు దిద్దుతోంది. అంతేగాకుండా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీతో పాటు దేశంలోని పలు ఆలయాల దగ్గర టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయి. భక్తులు ప్రతి ఏటా తమ ఇష్టదైవానికి భారీగా బంగారం కానుకలిస్తున్నారు. బంగారాన్ని బ్యాంకుల్లో దాచడానికి టిటిడి బోర్డుతో పాటు ఇతర ఆలయ బోర్డులకు ప్రత్యేక అనుమతులు అవసరం. బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆలయాలకు పెద్దగా ఆదాయం రావడం లేదన్న వాదన కూడా ఉంది. ఇలా వృథాగా ఉన్న బంగారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. 

దేశ సంపదలో అక్రమంగా దాచుకున్న బంగారం విలువ ఎక్కువగా ఉంటుందని కేంద్రం ఓ అంచనాకు వచ్చింది. అందుకే దీనిపై పన్ను వేస్తే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లబ్ది చేకూరుతుందన్న ఆలోచనతో కేంద్ర ఉంది. అయితే ఈ స్కీం కింద ఓ పరిమితి వరకే ప్రజలు తమ దగ్గరున్న బంగారం లెక్కలను ప్రభుత్వానికి వెల్లడించే వీలుంటుంది. అయితే ప్రజలకు ఈ పథకంలో కేంద్రం ఓ వెసులుబాటు కూడా కల్పించే అవకాశాలున్నాయి. వివాహితుల దగ్గర ఉండే బంగారానికి ఓ లిమిట్ వరకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తారు. అంతేకాకుండా దేశంలో ఉన్న బంగారం నిల్వల కోసం కేంద్రం త్వరలో గోల్డ్ బోర్డును కూడా ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా ఇందులో సభ్యత్వం ఉంటుంది. ప్రజలు సులభంగా బంగారాన్ని ఈ బోర్డు నుంచి కొనుగోలు చేసే విధంగా విధి విధానాలకు రూపకల్పన చేస్తారు. బంగారం నిల్వల పై మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఎంత వరకు ఫలించబోతోందో వేచి చూడాలి.