ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్...!
posted on Jan 6, 2014 8:40AM

"చిత్రం" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో కంగారుపడి తిరిగి కాల్ బ్యాక్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని..వాళ్ళు ఇంటికి చేరేలోపే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. వెంటనే ఉదయ్ ను అపోలో హాస్పిటల్ కి తరలించగా... అప్పటికే ఉదయ్ మరణించారని వైద్యులు నిర్దారించారు. ఈ వార్త విని సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్ రాజేష్ లతో పలువురు సినీ ప్రముఖులు హాస్పిటల్ వద్ద్దకు చేరుకున్నారు. ఈ విషయంపై హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... "మేము విషయం తెలియగానే వెంటనే ఇక్కడికి (అపోలో) రావడం జరిగింది. అందరు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కానీ ఉదయ్ అలా చేసుకునే వాడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చిన కూడా ధైర్యంగా ఉండేవాడు. నేను ఇపుడే పోలీసులతో మాట్లాడినాను. ఇది అసలు ఎలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందో తెలియజేయాలని కోరుతున్నాను. ఎలాగైనా ఈ విషాదం గురించి తెలుసుకోవలసిన బాధ్యత మాకు కూడా ఉంది" అని అన్నారు.
2012 అక్టోబర్ 24న విశితతో ఉదయ్ వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.