మొన్న రంగు..నేడు దుస్తులు..

 

శబరిమల ఆలయాన్ని అన్ని వయస్సుల మహిళలు దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మొదలు నేటికీ శబరిమలలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శబరిమల పరిసర ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంబ బేస్‌ క్యాంప్‌ దాటి వెళ్తుండగా నీలిమల వద్ద వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు.  కన్నూరుకు చెందిన ఇద్దరు మహిళలు ఎవరికి అనుమానం రాకుండా పురుషుల దుస్తుల్లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో  శబరిమల దర్శనానికి వచ్చారు. దాదాపు 5 కిలోమీటర్లు నడిచారు. అయితే వీరిని ఆందోళనకారులు గుర్తించి అడ్డుకున్నారు. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో మహిళలు మరికొంత దూరం ముందుకువెళ్లారు. అయితే నీలిమల వద్ద పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం మహిళలను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు మహిళలు వయసు తెలియకుండా రంగు వేసుకొని శబరిమల ఆలయాన్ని దర్శించుకోగా..భారీ ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.