గోదావరి నదిలో నిలిచిపోయిన మృతదేహాల వెలికితీత...

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంతో అనేక ఆందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా కొంత మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఇంకా పద్నాలుగు మంది ఆచూకీ దొరకలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ఇదిలా ఉంటే మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు ఈ బోటు ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నదిని గోదారమ్మగా కొలిచే ఆయా గ్రామాలు నదీమతల్లి మైలు పడిందని చెబుతున్నారు.

మృతదేహాల వెలికితీత పనులు దాదాపు నిలిచిపోయాయి అయితే, ఆచూకీ తెలియని వాళ్లకు సంబంధించి డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నట్లుగా అధికారులు మాట్లాడుతున్నారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోటును వెలికి తీసే ఉద్దేశం లేదని వారి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని, అయినా కనిపించకుండా పోయిన వారికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడమేంటని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి మృతదేహాన్ని వెలికి తీసే వరకు గోదావరి నీటిని వాడేది లేదని కచ్చులూరుతో పాటు ఆ దిగువ ప్రాంతాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు జీవనదిగా ఉన్న గోదావరిని ఈ ప్రాంత ప్రజలు నిత్యము తల్లిగా, దేవతగా పూజిస్తారు.

వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా నదీమతల్లికి పూజలు చేస్తుంటారు. జూన్ తొలి వారంలో కాలువలకు నీటిని విడుదల చేసే వేళ కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. మృతదేహాలన్నీ బయటికి వచ్చాక నదీమతల్లిని శుద్ధి చేసిన తర్వాతే నీటిని వాడుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. బోటు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జలశ్రీ మురళితో పాటు ఏజంట్ల వ్యవహారాలు చూసే రాజారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, మరిన్ని మృతదేహాలు వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు.