కుట్రపై కొరడా..

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన టర్కీ సైన్యం కుట్రను ప్రభుత్వ అనుకూల దళాలు, ప్రజలు కలిసి విఫలం చేశారు. సైనిక కుట్ర విఫలమైన తర్వాత ఆ దేశ ప్రభుత్వం కుట్రదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో పాల్గొన్న వారిని ఒక్కొక్కరుగా నిర్బంధంలోకి తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఆరువేల మందిని అరెస్ట్ చేశారు. అందులో మూడు వేల మంది సైనికులే. వారిలో సైన్యంలో అత్యున్నత పదవుల్లో ఉన్న ముగ్గురు జనరళ్లు, న్యాయమూర్తులు, ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. టర్కీ వాయువ్య తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగన్ విహారయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలోని ఓ చిలీక వర్గం శనివారం తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది.

 

టర్కీలోని ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ ఛానెల్‌ను తమ అధీనంలోకి తీసుకుని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు. కుట్ర విషయం తెలుసుకున్న అధ్యక్షుడు ఎర్డోగన్ ఆగమేఘాల మీద రాజధానికి తిరిగివచ్చి తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యక్షుని పిలుపు మేరకు లక్షలాది ప్రజల వీధుల్లోకి వచ్చి తిరుగుబాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇటు పోలీసులు, ప్రభుత్వ అనుకూల దళాలు సైనిక తిరుగుబాటుదారుల దాడిని ధీటుగా తిప్పికొట్టడంతో సైన్యం తోకముడిచింది.

 

రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించడమే కాకుండా 161 మంది పౌరులు, పోలీసులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వారిపై ఎటువంటి కనికరం చూపబోమని అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన తిరుగుబాటుదారులు ఒక్కొక్కరిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాత్కాలిక ఆర్మీ చీఫ్‌ స్టాఫ్‌గా జనరల్ ఉమిత్ దుందర్‌ను నియమించారు. శనివారం విధుల్లోంచి తొలగించిన మూడు వేల మంది న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదుల అరెస్ట్‌కు తాజాగా వారెంట్లు జారీ చేశారు. సిరియాలోని ఐఎస్ఐఎస్‌పై దాడులకు అమెరికా ఉపయోగిస్తున్న టర్కీ వైమానిక స్ధావరంలోని జనరల్, 12 మంది అధికారులు ప్రభుత్వం కూల్చివేత కుట్రలో కీలక పాత్రధారులని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. తిరుగుబాటు దారులు వినియోగించిన విమానాలకు ఈ స్థావరంలోనే ఇంధనాన్ని సమకూర్చారు. కుట్ర నేపథ్యంలో టర్కీ ఈ వైమానిక స్థావరాన్ని మూసేసింది.

 

అదే సమయంలో తిరుగుబాటుదారులపై కఠినంగా వ్యవహరించవద్దని పలు వర్గాలు అధ్యక్షుడిని కోరుతున్నాయి. కుట్రను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ప్రపంచ దేశాధినేతలు అనేకమంది ఖండించినప్పటికి..అదే సమయంలో టర్కీ ప్రభుత్వం కూడా చట్టాలను గౌరవించాలని సూచించారు. తిరుగుబాటుదారులపై బహిరంగంగా అధికారులు, ప్రజలు తీవ్రస్థాయిలో దాడులు చేయడం సరికాదని..వారికి చట్టపరిధిలో శిక్షలు విధించాలని వ్యాఖ్యానించారు.