రాజీ పడినా తిప్పలు తప్పటం లేదు... లేబర్ కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు

 

ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఇచ్చి గంటలు గడుస్తున్నాయి అయినా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు పంపాలని కోరింది. కార్మిక సంఘాలు కూడా లేబర్ కోర్టు పై విశ్వాసాన్ని ప్రకటించాయి. అయితే ఇప్పుడు లేబర్ కోర్టులో ఏం జరుగుతుంది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతుందా లేక కార్మికులకు అనుకూలంగా వస్తుందా అనే చర్చ జరుగుతోంది. కార్మిక చట్టాల ప్రకారం చర్చల ప్రక్రియ ముగిశాక 7 రోజుల తర్వాత సమ్మెకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ సంఘాలు అక్టోబర్ 4 న జాయింట్ లేబర్ కమిషనర్ సమక్షంలో చర్చలు జరిపాయి. మరుసటి రోజు.. 5 వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్ళాయి. దాంతో సమ్మె అక్రమమని జాయింట్ లేబర్ కమిషనర్ ప్రకటించారు. సమ్మె అక్రమమని జాయింట్ లేబర్ కమిషనర్ ఇచ్చిన నివేదికను పట్టించుకోవద్దని హై కోర్టు తుది తీర్పులో కోరింది. చర్చల పూర్తి సారాంశాన్ని 15 రోజుల్లో లేబర్ కోర్టుకు నివేదించాలని ఆదేశాలిచ్చింది. హై కోర్టు ఆదేశాల ప్రకారం లేబర్ కోర్టుకు నివేదిస్తామని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కార్మిక చట్టాలను అనుసరించి 6 నెలల్లోగా పరిష్కరించాలని కార్మిక చట్టాలు సూచించాయి.

కార్మికశాఖ నివేదికపై కార్మికులు.. ఆర్టీసీ యాజమాన్య వర్గాల.. వాదనలు విన్న తరువాత సమ్మె అక్రమమైనదా కాదా అనేది లేబర్ కోర్టు తేల్చనుంది. సమ్మె సక్రమమైతే సమ్మె కాలానికి జీతభత్యాలు ఇవ్వమని కోరే అవకాశముందంటున్నారు. అదే సమ్మె అక్రమమైతే కార్మికులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించే అవకాశముంది. సమ్మె కాలానికి జీతాలు చెల్లించకపోగా గరిష్ఠంగా 8 రోజుల జీతానికి కోత విధించాలని ఆదేశించే అవకాశముంది. అంతేకాదు సమ్మె అక్రమమని నిర్ధారిస్తే కార్మికుల సర్వీసు నిబంధనల ప్రకారం శిక్షలు విధించే విచక్షణాధికారం ఉంది. ఇందులో ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా ఉందని న్యాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది జరగటానికి చాలా ఏళ్లు పట్టే అవకాశముంది. అంతకాలం వేచి చూడటం కంటే అటు ప్రభుత్వం అయిన ఇటు కార్మిక సంఘాలైన రాజీ కుదుర్చుకోవడం మేలని అంటున్నారు. లేకపోతే ప్రభుత్వం ప్రజా రవాణా పూర్తి స్థాయిలో పునరుద్ధరించటంలో ఇబ్బంది తప్పదు. ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టడానికి కూడా ఇది ఆటంకంగా నిలుస్తుందని అంటున్నారు.