మౌనమే మేలోయి... ఆర్టీసీ సమ్మెపై టీఆర్ ఎస్ నాయకుల వైఖరి

 

ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. కానీ మంత్రి కేటీఆర్ తో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాత్రం మౌనమే మేలోయి అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది తెలంగాణలో మంత్రులు..అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు..నేతల.. పరిస్థితి. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతున్నా.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా.. చావుకేకలను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనికరం కలగడం లేదన్న అభిప్రాయాలు ఆయా వర్గాలలో వెల్లడవుతున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న నేతలు తమ సమ్మె పై మాట్లాడాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారితో కూడా ఇప్పటి వరకు నోరు విప్పలేదు.

గతంలో టీఎంయూ గౌరవ అధ్యక్షులుగా పని చేసిన మంత్రి హరీశ్ రావు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తలదూర్చేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రతిదానికి ట్విట్టర్ లో స్పందించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మౌన మునిగా మారారు.

ప్రస్తుతం ఆయన ట్విట్టర్ కు సెలవిచ్చారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఢిల్లీలో మాట్లాడించేందుకు నేషనల్ మీడియా ప్రయత్నించినా కేటీఆర్ స్పందించకపోవడం గమనార్హం. మొత్తం మీద ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నోరు మెదపకపోవడమే మంచిదనే అభిప్రాయం అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పైగా హై కోర్టు కూడా ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఉండటంతో దీని పై మాట్లాడకపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు.