గ‌డీని వీడి గ్రామాల్లోకి..  దొరకు ఈటల భయమా? 

తెలంగాణ‌లో దొర‌ల రాజ్యం. గ‌డీల పాల‌న‌. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కే అంకితం. స‌చివాల‌యానికి రాని ఏకైక ముఖ్య‌మంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేల‌నే క‌ల‌వ‌డు. ఇక ప్ర‌జ‌ల‌నేం పట్టించుకుంటాడు. ఇలా సీఎం కేసీఆర్‌పై అనేక విమ‌ర్శ‌లు. అవ‌న్నీ అటు తిరిగి, ఇటు తిరిగి.. ఫామ్‌హౌజ్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ ద‌గ్గ‌ర‌కే వ‌స్తాయి. చివ‌రాఖ‌రికి ఈట‌ల రాజేంద‌ర్ సైతం పార్టీని వీడుతూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ మీదే దుమ్మెత్తిపోశారు. త‌న‌ను గేటు కూడా దాట‌నీయ‌లేదంటూ.. అది బానిస భ‌వ‌న్ అంటూ మాంచి మ‌సాలా డైలాగ్ పేల్చి పోయారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉంటున్నా.. ఇటీవ‌ల ఆయ‌న టార్గెట్‌గా మాట‌ల తూటాలు డైన‌మైట్లా పేలుతుండ‌టంతో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు... గులాబీ బాస్‌లో అంత‌ర్మ‌థ‌నం... 

అవును, నిజ‌మే.. ఉక్కు మ‌నిషి.. నిండు కుండ‌లా.. తొన‌గ‌ని ముఖ్య‌మంత్రి.. పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ఇటీవ‌ల క‌రోనా వ‌చ్చి ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకున్న‌ప్పుడు.. ఈ ఏడేళ్ల రాజ‌కీయాన్ని రివైండ్ చేసుకున్నార‌ట‌. త‌న పాల‌న‌లో త‌ప్పొప్పుల‌న్నిటినీ ఓ పేప‌ర్ మీద రాసుకున్నార‌ట‌. త‌న‌పై వ‌చ్చిన‌, వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌న్నిటి వీడియోలు తెప్పించుకొని చూశార‌ట‌. వాట‌న్నిటినీ క్రూడిక‌రిస్తే.. విమ‌ర్శ‌ల‌న్నీ.. త‌న‌పై వేలెత్తి చూపుతున్న అంశాల‌న్నీ.. ఒకే ఒక్క అంశం చుట్టూ తిరుగుతున్నాయ‌ని గుర్తించార‌ట‌. అందుకే.. ఆ ఒక్క ఇష్యూను సెట్ చేస్తే.. ఇక త‌న‌ను టార్గెట్ చేసే నోళ్ల‌న్నీ మూత‌ప‌డ‌తాయ‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇంత‌కీ కేసీఆర్ చేస్తున్న ఆ మెయిన్‌ మిస్టేక్ ఏంటంటే.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ వీడి ప్ర‌జ‌ల్లోకి రాక‌పోవ‌డం. ఏ రాజ‌కీయ స‌భ‌లో మిన‌హా.. ముఖ్య‌మంత్రిని క‌ళ్లారా చూసే, క‌లిసే అవ‌కాశం.. మంత్రి నుంచి సామాన్య జ‌నం వ‌ర‌కూ ఏ ఒక్క‌రికీ ద‌క్క‌క‌పోతుండ‌టంతో వారిలో అస‌హ‌నం, అసంతృప్తి చెలరేగుతోంద‌ని సీఎం గుర్తించార‌ని తెలుస్తోంది. అందుకే, క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత.. కేసీఆర్ వ‌ర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింద‌ని గుర్తు చేస్తున్నారు. 

గాంధీ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించ‌డం.. పీపీఈ కిట్ లేకుండానే కొవిడ్ వార్డులో క‌లియ తిర‌గ‌డం.. బాధితుల‌తో నేరుగా మాట్లాడ‌టం.. గాంధీ త‌ర్వాత వ‌రంగ‌ల్ ఎమ్‌జీఎమ్‌కు వెళ్ల‌డం.. అక్క‌డా క‌రోనా చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం.. ఇలా ఎప్పుడూ లేని విధంగా.. సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి.. ప్ర‌జా స‌మ‌స్య‌లపై బ‌య‌ట‌కి రావ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. అది ఆయ‌న‌లో వ‌చ్చిన మార్పున‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు. ఈలోగా త‌న రైట్‌హ్యాండ్ ఈట‌ల రాజేంద‌ర్‌.. వెళ్తూ వెళ్తూ త‌న‌పై బ‌ట్ట‌కాల్చి మీదేసి పోయార‌నేది ఆయ‌న భావ‌న‌. నిజాలే అయినా.. అంత నిఖ్ఖ‌చ్చిగా చెప్ప‌డంతో.. గులాబీ బాస్ ఉలిక్కిప‌డ్డార‌ట‌. మంత్రినైన త‌న‌నే ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేటు దాట‌నీయ‌లేదంటే.. ఇక సామాన్యుల మొర ముఖ్య‌మంత్రి ఏం వింటారంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ధోర‌ణిలో ఈట‌ల.. ఈటెల్లాంటి మాట‌లు అనేసి.. త‌న ఇమేజ్‌ను మ‌రింత డ్యామేజ్ చేయ‌డంతో.. కేసీఆర్‌లో కంగారు మ‌రింత పెరిగింద‌ట‌. అందుకే, న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను ఇమ్మిడియేట్‌గా స్టార్ట్ చేశార‌ని చెబుతున్నారు. అదే, ఆక‌స్మిక త‌నిఖీలు.....

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసి పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించడం సంచ‌ల‌నం రేపుతోంది. అప్పుడెప్పుడో రెండు ద‌శాబ్దాల క్రితం చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు విన్న ప‌దం- ఆక‌స్మిక త‌నిఖీలు. అప్ప‌ట్లో సీఎం చంద్ర‌బాబు వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను స‌డెన్‌గా విజిట్ చేసి.. పెండింగ్ ఫైళ్ల‌తో పాటు.. తోలుమందం అధికారుల దుమ్ముకూడా దులిపేసేవారు. ఆ ఆక‌స్మిక త‌నిఖీలు చంద్ర‌బాబుకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చాయి. ఇన్నేళ్ల త‌ర్వాత‌.. ఇప్పుడు మ‌ళ్లీ కేసీఆర్ నోటి నుంచి ఆక‌స్మిక త‌నిఖీల మాట వినిపించ‌డం ఆస‌క్తికరంగా మారింది. 

కేసీఆర్ ఆక‌స్మిక త‌నిఖీల నిర్ణ‌యంపై ఈట‌ల రాజేంద‌ర్ ఎఫెక్ట్ బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌పై త‌రుచూ వినిపించే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను వీడి ప్ర‌జ‌ల్లోకి రాడు.. అనే విమ‌ర్శ‌కు ఈ ఆక‌స్మిక త‌నిఖీల‌తో శాశ్వ‌తంగా చెక్ పెట్టొచ్చ‌నేది కేసీఆర్ స్ట్రాట‌జీగా భావిస్తున్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించేందుకు గాను.. ముఖ్య‌మంత్రి గ్రామాలు, పట్ట‌ణాలు ప‌ర్య‌టిస్తే.. అది ప్ర‌జ‌ల్లో మాంచి ఊపు తీసుకొస్తుంద‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌లా ఉంది. అస‌లే మాయ‌ల‌మ‌రాఠీలా రాజ‌కీయ గారెడీలు చేసే కేసీఆర్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తే.. ఆయ‌న క్రేజ్ అమాంతం పెర‌గ‌డం ఖాయం.. ఆ మేర‌కు ప్ర‌తిప‌క్షాల‌కే న‌ష్టం.. అనే వాద‌నా వినిపిస్తోంది. ఏదిఏమైనా.. ప్ర‌జ‌ల్లో సీఎం కేసీఆర్ గ్రాఫ్‌ దారుణంగా ప‌త‌న‌మైన వేళ‌.. ఫామ్‌హౌజ్‌ పాల‌న, దొర‌ల రాజ్య‌మంటూ జ‌నం విసుక్కుంటున్న వేళ‌.. త్వ‌ర‌లోనే కేసీఆర్ చేబ‌ట్ట‌బోయే ఆక‌స్మిక త‌నిఖీలు ఆయ‌న పొలిటిక‌ల్ ఇమేజ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపనుందో చూడాలి..