టాప్ న్యూస్ @ 1PM

రాష్ట్ర ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలపై చర్చించారు.పెండింగ్ నిధులు, ప్రాజెక్ట్‌ల జాప్యంపైనా భేటీలో చర్చించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలోని ఎంపీలు కనకమేడల, అయోధ్య రామి రెడ్డి, మార్గాని భారత్, గోరంట్ల మాధవ్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వంగా గీత, సత్యవతి, ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప, బ్రహ్మానంద రెడ్డి, తలారి రంగయ్య, అనురాధ హాజరయ్యారు. 
---------
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు నమోదైంది. భూ వివాదంలో ఆయనపై చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకో ఎంపీ  గల్లా జయదేవ్ సహా 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
-------
రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి కౌలు చెల్లించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వి వి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కొంతమందికి కౌలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని  న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు వచ్చే గురువారంలోపు ఇవ్వాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది
-------
కృష్ణా జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ రైతు యాత్ర నిర్వహిస్తోంది. రైతు యాత్రలో పసుపు శ్రేణులు కదం తొక్కాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. వేలాది మంది పాల్గొన్న రైతు యాత్రను బైక్ ర్యాలీతో మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. 
-----------
విశాఖపట్నంలో రోడ్లను బాగు చేయాలంటూ శ్రమదానం చేస్తూ సీపీఎం నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్వర్ణ భారతి స్టేడియం ఎదుట ప్రధాన రహదారిపై గుంతలను పూడ్చి..రోడ్లను మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం కార్పొరేటర్ గంగారావు, పార్టీ నగర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లను పూడ్చి వేస్తున్న సమయంలో సీపీఎం నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు
------
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను బీజేపీ పార్టీ ప్రకటించింది. హుజురాబాద్ ఉపఎన్నిక టార్గెట్‌గా ముందుకెళ్తోన్న సంగ్రామ యాత్ర ముగింపు సభను అక్టోబర్ 2న హుస్నాబాద్‎లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. అయితే.. షెడ్యూల ప్రకారం హుజురాబాద్‎లో ముగింపు సభ అనుకున్నారు. కానీ..ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో సభను హుస్నాబాద్‎లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
---------
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‎తో రైతు ఎతీశ్వర్‌రెడ్డి(40) మృతి చెందాడు. ఈ ఘటన గొవిందుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. పొలం దగ్గర మొక్కజొన్న పంటకు అడవి పందులు రాకుండా వేసిన విద్యుత్ కంచె తీగలకు తాకిన అన్న శంకర్ రెడ్డిని కాపాడబోయి తమ్ముడు ఎతీశ్వర్ రెడ్డి పక్కనున్న కంచె మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 
-----
తెలంగాణ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాకిచ్చారు. పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై అతివేగంగా వెళ్లినందుకు ఆయన వాహనానికి ఓవర్‌స్పీడ్‌ చలానాలు విధించారు. సోమేష్ కుమార్‌ అధికారిక వాహనం(టీఎస్09ఎఫ్ఏ0001)కు రూ.3వేలు చలానా విధించారు. విషయం తెలియగానే అధికారులు జరిమానా చెల్లించారు. 
------
పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు. పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీంతో భయాందోళనకు గురైన వాచ్‌మెన్.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాచ్ మెన్ ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
-------
ఈక్వెడార్ దేశంలోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 116 మంది మరణించారు. ఈక్వెడార్ జైలు కాంప్లెక్సులో ఖైదీలు తుపాకులు, గ్రనేడ్లతో ఘర్షణ పడ్డారు. మెక్సికన్ డ్రగ్స్ ముఠాల వల్ల ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని జైలు అధికారులు చెప్పారు.జైలులో జరిగిన అల్లర్లలో 116 మంది మరణించారని, వీరిలో ఆరుగురిని శిరచ్ఛేదం చేశారని నేషనల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu