తెలుగువారి అదృష్టం Toneflix యాప్ – నారా లోకేష్‌

 

డిజిటల్‌ మాధ్యమంలో మరో విప్లవానికి తెరతీస్తూ తెలుగువన్‌ రూపొందించిన TONEFLIX అప్లికేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతిరాజ్, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారాలోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. నిన్న విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాలోకేష్‌తో పాటుగా తెలుగువన్ మేనేజింగ్‌ డైరక్టర్ కంఠంనేని రవిశంకర్‌, ఆబ్జెక్ట్‌ వన్‌ డైరక్టర్‌ జయప్రకాష్‌, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. విజయానంద్ ప్రభుతులు పాల్గొన్నారు. వీరితో పాటుగా తెలుగువన్‌తో కలిసి TONEFLIX అప్లికేషన్‌ను రూపొందించడంలో భాగస్వామిగా నిలిచిన స్వీడన్‌కు చెందిన టెరానెట్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో తెలుగువన్‌ తరఫున శ్రీ రవిశంకర్‌ మాట్లాడుతూ, తెలుగువారు ఎక్కడ ఉన్నా తొలి స్థానంలో ఉండాలనే ఆకాంక్షతో తెలుగువన్ సంస్థను నెలకొల్పామంటూ తమ లక్ష్యాన్ని పేర్కొన్నారు. TONEFLIX అప్లికేషన్‌ ద్వారా ఎలాంటి ఇంటర్నెట్‌, డేటా చార్జీల అవసరం లేకుండా అపరిమితమైన వీడియోలను షేర్‌ చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ అప్లికేషన్ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదనీ... ఆడియో ఫైల్స్, ఈ బుక్స్, డాక్యుమెంట్లని కూడా షేర్‌ చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ మాధ్యమాల ద్వారా చదువుని సాగించే E-Learning రంగంలో కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని ఆశించారు. ఇప్పటికే విజయవాడ బస్‌స్టేషన్‌లోని ప్రయాణికులకు ఇంట్రానెట్‌ ద్వారా ఉచితంగా వీడియో కంటెంట్‌ చూసే అవకాశం కల్పించామని... ఇప్పుడు Toneflix  అప్లికేషన్‌ ద్వారా బస్సులో ప్రయాణిస్తూ కూడా వీడియోలు చూసుకునే సౌలభ్యం కలగనుందని చెప్పుకొచ్చారు. ఈ యాప్ ఉన్నవారు తమ మొబైల్‌లో ఉన్న వీడియోలను ఒకరి నుంచి ఒకరికి షేర్‌ చేసుకోవచ్చుననీ, ఈ క్రమంలో వారి వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదని భరోసాని అందించారు. హైదరాబాదుని శరవేగంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యుల చేతుల మీదుగా ఈ యాప్‌ను విడుదల చేయించడం తన ఉద్దేశమంటూ, మనసులోని కోరికను వెలిబుచ్చారు.

 

ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించిన నారాలోకేష్‌ మాట్లాడుతూ తెలుగువన్‌తో తనకి ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2000 సంవత్సరం నంచే తాను తెలుగువన్ వీడియోలు చూస్తూ వచ్చాననీ, ఇప్పటికీ తాను తెలుగువన్‌ చూస్తూ ఉంటాననీ చెప్పుకొచ్చారు. Toneflixలాంటి యాప్ ఒకటి వస్తుందని తాను కూడా ఊహించలేదనీ, ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి సాంకేతికత నిజం కావడం అందరి అదృష్టమనీ కొనియాడారు. తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి విప్లవం, అభివృద్ధికి దారితీస్తుందని ఆశించారు. ఒకప్పుడు బస్సులో వేసిన ఒకే ఒక్క సినిమాను బలవంతంగా చేసే పరిస్థితి ఉండేదనీ, Toneflix యాప్ ద్వారా బస్సులో యాప్‌ ఉన్నవారంతా తమ వీడియోలను షేర్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇంత క్లిష్టమైన యాప్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ అసాధారణంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇలాంటి మాధ్యమాల వల్ల భారీస్థాయిలో ఉద్యోగాలని కల్పించలేకపోవచ్చు కానీ, ఉపాధికి మాత్రం అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఉన్న ప్రతిభని నిరూపించుకునేందుకు తెలుగువన్‌ ఆస్కారం ఇస్తోందని ప్రశంసించారు. దాదాపు 1500 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు తెలుగువన్ ద్వారా షార్టఫిల్మ్స్‌ను ప్రపంచంతో పంచుకుంటున్నారని కొనియాడారు. తమ ప్రభుత్వం కూడా డిజిటల్ మాధ్యమానికి పెద్దపీట వేస్తోందనీ, 2019 నాటికి ఫైబర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేసి ఇంటింటికీ ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ సదుపాయాలను కల్పించే ప్రయత్నం చేస్తోందనీ గుర్తుచేశారు. తాను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల చేస్తున్న తొలి యాప్‌ Toneflix విజయవంతం కావాలని ఆశించారు. Toneflix యాప్‌లో 1500 చిత్రాలు, 45 వేల వీడియోలు ఉన్నాయి కాబట్టి టెక్నాలజీకి అనుగుణమైన కంటెంట్‌ కూడా ఉందంటూ ప్రశంసించారు. ఈ యాప్ చెంత ఉంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా హాయిగా ప్రయాణం చేసేయవచ్చంటూ కితాబునిచ్చారు. తెలుగువన్‌ సారధిగా విజయవంతమైన రవిశంకర్‌గారు అమరావతిలో కూడా పెట్టుబడి పెట్టాలంటూ ఆహ్వానించారు.

 

టోన్‌ఫ్లిక్స్‌ యాప్‌ ఆవిష్కరణలో భాగంగా మున్ముందు ‘స్మార్ట్‌ విలేజ్‌ అప్లికేషన్’ పేరుతో మరో యాప్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు టెరానెట్‌, తెలుగువన్‌ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. దీంతో గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి డేటా, ఫోన్‌ చార్జీలు చెల్లించే అవసరం లేకుండానే యాప్‌ ఉన్న ఇతర వ్యక్తులతో సంభాషించే అవకాశం ఉంటుంది. అదే కనుక సాధ్యమైతే డిజిటల్‌ చరిత్రలో మరో అద్భుతం సాకారమవుతుందని భావిస్తున్నారు.