డ్రగ్స్ మత్తు! సినీ గ్లామర్ గమ్మత్తు!

 

ఒక సన్నని వస్త్రం. దాని మీద కదిలే బొమ్మలు. సినిమా అంటే ఇంతే! కాని, ఈ టెక్నాలజీని కనుగొంటున్నప్పుడు సదరు సైంటిస్ట్ ఊహించి కూడా వుండడు! ఏమని? మన భారతదేశం లాంటి దేశంలో, తెలుగు, తమిళ రాష్ట్రాల్లాంటి ప్రాంతాల్లో సినీ గ్లామర్ డ్రగ్స్ కంటే ఎక్కువ మత్తు కలిగిస్తుందని! పూరీ జగన్నాథ్ విచారణ కోసం ఎక్సైజ్ శాఖ అధికారుల ముందుకి వచ్చినప్పుడు జరిగిన హంగామా చూస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది!

 

అసలు సినిమా వాళ్లకు వుండే ఫ్యాన్స్, వారి పట్ల జనం చూపించే క్రేజ్ ఏ లాజిక్కి అందదు! అయితే, హీరోలు, హీరోయిన్స్ విషయంలో దాన్ని అర్థం చేసుకోవచ్చు! హీరోలో తమని తాము చూసుకుంటారు ఫ్యాన్స్! తమకు లేనివన్నీ అతడిలో చూసుకుని తాత్కాలిక సంతృప్తి పొందుతారు! ఇక హీరోయిన్స్ కైతే వారి అందమే వారికి సర్వం. దాని వల్లే మగ, ఆడా అందరూ అభిమానించేస్తుంటారు. నటన కూడా ఓ కారణమే అయినా హీరోయిన్స్ కి ప్రధనా ఆకర్షణ వారి అందమే! అందుకే బోలెడంత మంది ఫ్యాన్స్! కాని, డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణ ఎదుర్కొంటోన్న దర్శకుడు  పూరీ జగన్నాథ్ కు భీభత్సంగా ఫ్యాన్స్ వుండటం ఏంటి? వారొచ్చి విచారణ జరుగుతోంటే రోడ్ల మీద పడిగాపులు పడటం ఏంటి? మా దర్శకుడు అమాయకుడు, కడిగిన ముత్యంలా బయటకొస్తాడంటూ మీడియా వారికి చెప్పటం ఏంటి?

 

డైరెక్టర్ కి ఫ్యాన్స్ వుండకూడదని ఎక్కడా లేదు. హిట్ సినిమాలు ఇస్తే డైరెక్టర్స్ కి కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు. కాని, డ్రగ్స్ వాడటం లాంటి సీరియస్ కేసులో ఇరుక్కున్న  పూరీకి ఫ్యాన్స్ అండ లభించటం ఆశ్చర్యకరమే! తెర వెనుక వుండే టెక్నీషియన్స్ కి కూడా ఈ రేంజ్లో ఫాలోయింగ్ వుండటం .. బహుశా తెలుగులో కాక తమిళంలో మాత్రమే వుంటుందేమో! అంతే కాదు, జగన్ విచారణ సమయంలో అక్కడికొచ్చిన అతడి తమ్ముడు, కొడుకుతో కూడా చాలా మంది సెల్ఫీలు దిగారట! ఇది సినీ గ్లామర్ కున్న మరో కోణం! పూరీ ఫ్యామిలీ డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా వుంటే జనం మాత్రం సెల్ఫీలతో మురిసిపోవటం… నిజంగా క్రేజీనే!

 

జనంలో సినిమా వాళ్లపై అభిమానం వుండకూడదనీ, వాళ్లు తమ అబిమాన హీరో, హీరోయిన్, దర్శకుల వంటి వారికి కష్టమొస్తే నైతికంగా మద్దతు ఇవ్వకూడదనీ మనం చెప్పలేం. అలాగే, ఎవరు ఎవరితో ఎక్కడ సెల్ఫీలు దిగాలో కూడా వారి వారి ఇష్టం! కాని, పూరీ జగన్నాథ్ విచారణ సందర్భంగా ప్రూవ్ అయింది మాత్రం ఒక్కటే! సినిమా గ్లామర్ కు డ్రగ్స్ కంటే మత్తెక్కువ! దాన్నుంచి జనం బయటపడటం అంత ఈజీ కాదు. అందుకే, ఒక్కోసారి చట్టం తన పని తాను చేసుకుపోనీయకుండా రోడ్ల మీదకొచ్చి హంగామా చేస్తుంటారు. అది సల్మాన్ అయినా, జయలలిత అయినా మరొకరైనా ఇంకొకరైనా! ఇప్పుడు పూరీ విచారణ సమయంలోనే ఈ రేంజ్లో హడావిడి జరిగితే రేపు రవితేజ, ఛార్మీలు వస్తే ఏమవుతుందో ఈజీగా ఊహించుకోవచ్చు!