డ్రగ్స్ కేసు నుంచి అకున్ సబర్వాల్‌ని తప్పిస్తారా..?

టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్‌పై ఉక్కుపాదం మోపిన తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కథనాలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన ఈ నెల 16 నుంచి 27 వరకు సెలవుపై వెళ్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. సినీ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండటం వల్లే ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపిస్తోందంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ పుకార్లపై అకున్ సబర్వాల్‌ క్లారిటీ ఇచ్చారు. తన తల్లి మరణించారని, ఆమె అస్తికలను నిమజ్జనం చేసేందుకు తాను సొంత ఊరికి వెళుతున్నట్లు చెప్పారు. డ్రగ్స్ కేసుకు ముందే సెలవుకు దరఖాస్తు చేశానని..తన సెలవుకు, డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు.