కార్యకర్తలకు చిరు తిరుక్షవరం
posted on Mar 31, 2012 7:05AM
రాజ్యసభకు ఎన్నికయిన చిరంజీవి తిరుపతి అసెంబ్లీ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. తిరుపతిలో ఆయన్నే నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను నట్టేట ముంచారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఆశించిన వారంతా సొంత డబ్బులతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల తరువాత చిరంజీవి అయితే గెలిచారు గాని, రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అతికొద్ది స్థానాలు మాత్రమే గెలుచుకో గలిగింది. అయినా ఈ కార్యకర్తలు, నాయకులు నిరాశాపడ లేదు. శాసనసభ్యుడిగా ఉన్న చిరంజీవి తమకు ఇక్కడ పెద్దదిక్కుగా ఉంటారని వారు ఆశించారు. ఆ ఆశలను కూడా చిరంజీవి ఇప్పుడు అడియాశలు చేశారు. దీంతో చాలామంది చిరంజీవి అభిమానులు, ఆయనకు నమ్ముకున్న నాయకులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలవైపు ఆశగా చూస్తున్నారు. చిరంజీవికి కుడిభుజంలా వ్యవహరించిన జంగాలపల్లి శ్రీనివాసులు ఇప్పుడు టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. చిరంజీవి తన రాజీనామాతో తిరుపతిలోనూ పట్టుకోల్పోతున్నారు. తన స్థానంలో మరెవరికైనా టిక్కెట్ ఇప్పించుకుంటే గెలిపించుకునే బాధ్యతను కూడా ఆయనే భరించాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థి ఎంపికలో చిరంజీవి పాత్ర నామ మాత్రంగానే ఉంటుందని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. ఈ నేపథ్యమే ఆయనను నమ్ముకున్న నేతలను ఆగమ్యంలోకి నెట్టేస్తుంది.