తిరుమల అన్నప్రసాదంలో అదనంగా వడ
posted on Mar 6, 2025 11:44AM

తిరుమల అన్న ప్రసాదంలో అదనంగా వడను కూడా చేర్చారు. తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కొండపై హోటళ్లలో నాణ్యత విషయంలో టీటీడీ చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంది. అలాగే తిరుమల గిరిపై పారిశుద్ధ్యం, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్న, జల ప్రసాదాల పంపిణీని పునరుద్ధ రించింది.
తిరుమల లడ్డూ నాణ్యత పెంచింది. అలాగే భక్తులకు ఉచిత అన్న ప్రసాదం పథకంలో మార్పులు చేసింది. అదనంగా వడను కూడా అన్న ప్రసాదంలో చేర్చింది. అన్నప్రసాదంలో అదనంగా వడ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం (మార్చి 6) నుంచి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులకు టీటీడీ చైర్మన్ స్వయంగా వడలను వడ్డించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు టీటీడీ ఈవో శ్రామలరావు, అడిషనల్ ఈవో సీహఎచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ గా తాను బాధ్యతలు చేపట్టిన తరువాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక అధరవు చేర్చాలన్న యోచన చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయన అంగీకారంతో, ఆమోదంతో వడను అన్న ప్రసాదంలో అదనపు అధరవుగా చేర్చినట్లు చెప్పారు. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని చైర్మన్ తెలిపారు.