లోకేష్ పోటీ చేసేది ఇక్క‌డి నుంచే..

 

టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంత్రి ప‌ద‌విని చేప‌ట్టేందుకు అన్ని క‌లిసి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న లోకేష్ ను ఎలాగైనా కేబినెట్ లోకి తీసుకోవాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి మంత్రిని చేయాల‌ని నిర్ణ‌యించారు. ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తే లోకేష్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేడ‌ని ఇలా దొడ్డి దారిన మంత్రిని చేశారనే విమ‌ర్శలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బాబు ఊహించారు.

 

ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు రెండు ప్ర‌శ్న‌ల‌కు ఒకేసారి స‌మాధానం చెప్పాల‌ని డిసైడ్ అయిన టీడీపీ అధినేత త‌న‌యుడి కోసం నియోజ‌క‌వ‌ర్గాన్ని రెడీ చేసే ప‌నిలో ప‌డ్డారంట‌. కృష్ణా జిల్లా పెన‌మలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్ తో పోటీ చేయించాల‌ని బాబు వ్యూహం వేశారని ప‌చ్చ కండువాలు గుస‌గుస‌లాడుతున్నాయి. పెన‌మ‌లూరు బెజ‌వాడ‌ను ఆనుకుని ఉంటుంది. అక్క‌డ చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంతో పాటు టీడీపీ బ‌ల‌మైన బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. అదీ కాక ఆ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌.  స్థానిక ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ కూడా తాను లోకేష్ కోసం రాజీనామా చేస్తాన‌ని ఇంత‌కు ముందే ప్ర‌క‌టించారు. ఇన్ని అనుకూల‌త‌లు ఉండ‌బ‌ట్టే ఏపీ సీఎం పెనమ‌లూరుని ఎంపిక చేసిన‌ట్టున్నారు.