ఈ మౌనం ఎందుకో..?

దాదాపు పది రోజుల ఉత్కంఠకు తెరపడింది.. విమర్శకుల ప్రశ్నలకు జవాబు దొరికింది.. అందరికి షాకిస్తూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఏ నేతైనా పార్టీని వదిలి వెళ్లిన తర్వాత సదరు పార్టీలోని చోటా, మొటా నేతలంతా వెళ్లిపోయిన నేతపై మూకుమ్మడిగా ఎటాక్ చేస్తారు. వరుస ప్రెస్ మీట్లు, ఎక్కడ మైక్ దొరికితే అక్కడ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. మరి అలాంటిది పార్టీ నుంచి వెళ్లిపోయింది గాక వెళుతూ.. యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వారు తెలంగాణ ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతూ ఆయన్నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందుతున్నారంటూ.. వెళుతూ, వెళుతూ సొంతవాళ్లని టార్గెట్ చేసి సంచలన విమర్శలు చేశారు.

 

అయితే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆ వ్యాఖ్యలను ఒక్కరంటే ఒక్కరు కూడా తిప్పికొట్టడానికి ముందుకు వస్తే ఒట్టు. కానీ రెండు, మూడు రోజుల తర్వాత పయ్యావుల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న వేళ.. మీ స్నేహితుడైన రేవంత్ రెడ్డిగారు మీరు కేసీఆర్‌తో స్నేహంగా మెలిగి వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందారట కదా అని ఓ విలేఖరి అడగ్గా.. అందుకు సమాధానంగా కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితతో రేవంత్‌కు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించారు. అయితే రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తారని అందరూ.. భావించగా ఆశ్చర్యకరంగా ఒక్కరు కూడా కిక్కురుమనడం లేదు.

 

తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కారణం ఏమిటో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే పార్టీ అధినేతతో పాటు టీడీపీని తీవ్ర ఇబ్బందులు పెట్టిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం బాగా ఉండటం వల్లే పచ్చ నేతలు సైలెంట్ అయ్యారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. రేవంత్‌ను ఏమన్నా అంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో కాస్తంత మెతకగానే ఉండాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు పొలిటికల్ టాక్.

 

అందువల్లే రేవంత్‌ను విమర్శించేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదని అంటూ ఇతర పార్టీల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శనివారం నాడు చంద్రబాబుతో భేటీ అయిన టీటీడీపీ నేతలు ఆ సమావేశం తర్వాత బయటకి వస్తూ రేవంత్‌ను విమర్శించే ఉద్దేశం తమకు లేదని మీడియాకు సెలవిచ్చారు. పైగా రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్‌ను కోల్పోవడం పార్టీకి తీరని నష్టమే అన్నారు. మొత్తానికి సైకిల్ నేతలు రేవంత్‌పై తమ ప్రతాపం చూపకుండా ఎన్ని రోజలు మౌనంగా ఉంటారో వేచి చూద్దాం.