ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం

 

ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు, ఇంకా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలు కాకముందే తెలంగాణకు ప్రత్యేక పిసిసి వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రక్షణ శాఖ మంత్రి ఆంటోనిని కలిసి విన్నవించుకొన్నారు. తెలంగాణా కోసం ఎన్ని త్యాగాలకయినా సిద్దం అని ఉత్తర ప్రగల్భాలు పలికేవారందరూ ఇంకా తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందే పదవులకోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే, రేపు రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి పదవికోసం, ఇతర మంత్రి పదవులకోసం తమ సహచర నేతలతో వారు ఎటువంటి యుద్దాలు చేస్తారో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనమయితే గనుక, ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. అప్పుడు తెరాస వర్గం, కాంగ్రెస్ వర్గం అనే రెండు కొత్త వర్గాలు కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చి, ఆదిపత్యం కోసం ఒకదానితో మరొకటి కత్తులు దూసుకొంటాయేమో? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీని విలీనం చేసుకొంటే అక్కడా ఆ పార్టీకి అదే పరిస్థితి ఏర్పడుతుందేమో? ఇంతకీ రాష్ట్ర విభజనతో తన ప్రత్యర్ధులను దెబ్బ తీసి తను లాభపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, తెరాస, జగన్ పార్టీలే తిరిగి ఎసరుపెట్టినా ఆశ్చర్యం లేదు. అత్యాశకుపోతే, ఏపార్టీకయినా అదే పరిస్థితి తప్పదని చెప్పవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu