తెలంగాణ వల్ల రాయలసీమకు నష్టం

 

 

 

రాయలసీమను విభజిస్తే తాము సహించబోమని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రాయల తెలంగాణ పేరుతో రాయలసీమను విభజించాలనే ప్రతిపాదన ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయని, ప్రజల ఆకాంక్ష మేరకు తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులు కూడా తెలంగాణ కావాలని అంటున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో సమైక్యవాదాన్ని కోరుకుంటున్న తాము వీక్ పాయింట్‌లో ఉన్నామని మంత్రి అన్నారు.


తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు ఇంకా అనుకోలేదని, ఇచ్చేస్తారేమోననే భయమూ ఆందోళనతో తాము మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ విడిపోతుందుంటేనే బాధ కలుగుతోందని, దానికి తోడు రాయలసీమను విడగొట్టడం ఎందుకని ఆయన అన్నారు. తాము ఇప్పటికే బళ్లారిని కోల్పోయామని, దానివల్ల తుంగభద్ర నీరు తమకు రాకుండా పోతోందని, మంచినీళ్లు కూడా తమకు అందడం లేదని ఆయన అన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలను రాయలసీమలో కలపాలని ఆయన అన్నారు. దానివల్ల జలవివాదాలు రావని, అంతేకాకుండా ఆ ప్రాంతాల ప్రజలతో రాయలసీమ ప్రజలకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు.

 

రాష్ట్ర విభజన పై సీమాంధ్ర ప్రజల నుంచి స్పందన లభించడం లేదని, ఈ స్థితిలో రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగితే సీమాంధ్ర ప్రజలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.