తెలంగాణా ఎంసెట్ పరీక్ష నేడే

 

రాష్ట్ర విభజన జరిగి ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఎంసెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే విషయంలో రెండు ప్రభుత్వాలు పంతాలకు పట్టింపులకి పోయాయి. కానీ చివరికీ తెలంగాణా ప్రభుత్వం తన పంతమే చెల్లించుకొంది. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే వేరేగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించుకొంది.

 

ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎంసెట్ పరీక్షలు జరుగబోతున్నాయి. వీటికి మొత్తం 2,31,998 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. వీరిలో 1,39,636మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్, 92,362 మంది విద్యార్ధులు మెడికల్ ఎంట్రన్ పరీక్షలు వ్రాస్తున్నారు. వీరి కోసం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 432 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో 189 కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు కనుక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో ఎనిమిది జోన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది జోన్లలో పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులను చేర్చేందుకు ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా మొత్తం 261 బస్సులను కూడా ఏర్పాటు చేసారు. కానీ నిన్నటితోనే ఆర్టీసీ సమ్మె ముగియడంతో ప్రభుత్వం, ఎంసెట్ నిర్వాహకులు కూడా ఊపిరి పీల్చుకొన్నారు. తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఎంసెట్ పరీక్షల కోసం ‘కోడ్-క్యూ’ పరీక్షా పత్రాల సెట్ ని ఎంపిక చేసారు. తాజా సమాచారం ప్రకారం కొద్ది సేపటి క్రితమే రాష్ట్రంలో అన్ని సెంటర్లలో ఎంసెట్ పరీక్ష మొదలయింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా సాగుతోంది.