తెలంగాణ బడ్జెట్ : అప్పుడే పుట్టిన బిడ్డలకు డైపర్లు ఫ్రీ!

బడ్జెట్ రాగానే అందరూ ఏ రంగానికి ఎంత కేటాయించారు అంటూ ఆరా తీస్తారు.ఇక షరా మామూలుగా అధికార పక్షం మా ఆర్దిక మంత్రి బడ్జెట్ పాఠం సుప్రభాతంలా ఇంపుగా, విన సొంపుగా వుందంటూ దబాయిస్తుంది! అందుకు విరుగుడుగా ప్రతిపక్షం ఇలాంటి బడ్జెట్ గతంలో ఎప్పుడూ చూడలేదంటూ గతంలో చెప్పిన డైలాగే చెప్పి చెప్పి జనాన్ని విసిగిస్తుంది. అందుకే, రాను రాను బడ్జెట్ ల మీద ప్రజల దృష్టి తగ్గిపోతోంది. కేంద్ర బడ్జెట్ అయితే కాస్త హడావిడి వుంటుంది కాని రాష్ట్ర బడ్జెట్ లకు అంత మాత్రం కూడా వుండటం లేదు. న్యూస్ ఛానల్స్ లో మంత్రి వల్లె వేసినంత సేపు లైవ్ పెట్టడం, తరువాత ప్రతిపక్షాల పసలేని విమర్శలు వినిపించటం, ఒకరిద్దరు ఆస్థాన విద్వాంసులతో కలిసి సీనియర్ జర్నలిస్టులు బడ్జెట్ కు పోస్ట్ మార్టం నిర్వహించటం... ఇంతే! మర్నాడు మరేదైనా బ్రేకింగ్ న్యూస్ బడ్జెట్ అంటూ ఒకటి వచ్చిందనే అంతా మరిచిపోతున్నారు! 

 


తెలంగాణ బడ్జెట్ ఇవాళ్ల అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఒకవైపు అయిదు రాష్ట్రాల్లో బీజేపి విజయాల కలకలం, అక్కడి ముఖ్యమంత్రుల ఎంపిక, మరో వైపు ఏపీలో భూమా నాగిరెడ్డి హఠాన్మరణం... ఇలాంటి పరిణామాల మధ్య ఈటెల చిట్టాపద్దుల్ని ఎవ్వరూ సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేయలేదు. చేసినా కూడా బడ్జెట్ లో మరీ సంచలనాత్మకమైన నిర్ణయాలు లేకపోవటంతో సాదాసీదాగా వ్యవహారం నడిచిపోయింది! జాగ్రత్తగా వడ్డింపులు చేసిన బడ్జెట్ లో ఈటెల అన్ని రంగాలకి కేటాయింపుల రుచి చూపించారు. అయితే, ఏ ఒక్క రంగంలో రాబోయే సంవత్సర కాలంలో అద్బుతాలు చేయబోతున్నామని మాత్రం చెప్పలేదు. ఎన్నికలు మరీ దగ్గర్లో లేవు కాబట్టి విపరీత వరాలు కూడా కురిపించలేదు!

 


తెలంగాణ బడ్జెట్ 2017-18లో రొటీన్ కి భిన్నంగా ఆకట్టుకున్న ప్రతిపాదన కేసీఆర్ కిట్! ఈ కిట్  అప్పుడే పుట్టిన కిడ్ కు... అంటే బిడ్డకు అందిస్తారు! ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు మూడు దఫాల్లో నాలుగేసి వేల చొప్పున పన్నెండు వేలు ఇస్తారు. గర్భీణీ స్త్రీ హాస్పిటల్లో చేరిన వెంటనే, డిశ్చార్జ్ సమయంలో, పోలీయో టీకా వేయించుకోవటానికి వచ్చినప్పుడూ ఈ డబ్బులిస్తారు. అంతేకాదు, కేసీఆర్ కిట్ పేరున సబ్బులు, బేబీ అయిల్, చిన్న పిల్లల పరుపు, దోమతెర, డ్రస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు.... ఇలా పుట్టిన బిడ్డ ఆడుకోటానికి కావాల్సిన ఆట వస్తువులు కూడా ప్రభుత్వమే ఇవ్వనుంది! ఇందుకోసం 605కోట్లు కేటాయించారు బడ్జెట్ లో! 

 


పేద తల్లులు ప్రసవించినప్పుడు వారికి ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కిట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం మెచ్చుకోదగ్గదే. కాని, పేరే... కేసీఆర్ కిట్ గా ప్రచారం చేసుకోటం కాస్త ఇబ్బందికరం! తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అన్నట్టుగా సంప్రదాయం మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు!