మంత్రి వర్గ విస్తరణ చేస్తారనుకొంటే

 

నవంబర్ 5నుండి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, పొరుగు రాష్ట్రంతో గొడవలు, మీడియాపై ఆంక్షలు వంటి అనేక అంశాలు ప్రతిపక్షాలకు కావలసినన్ని అస్త్ర శస్త్రాలను అందిస్తున్నాయి. వారిని ఎదుర్కొనేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేసి బలం పెంచుకొంటారని అందరూ భావించారు. కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా ప్రతిపక్షాల నేతలపై ‘ఆకర్ష్ అస్త్రం’ ప్రయోగించి వారిని సమ్మోహితులను జేసి తనవైపు త్రిప్పుకొంటూ అసెంబ్లీలో తన పార్టీ బలం పెంచుకొంటున్నారు.

 

బహుశః ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్దాంతాన్ని కేసీఆర్ సింపుల్ గా ఫాలో అయిపోతున్నారేమో? ప్రతిపక్ష పార్టీలో ఉన్న యం.యల్.ఏ.లు ఇప్పుడు హటాత్తుగా అధికార పార్టీలోకి రావడంతో వారందరూ తమ గులాబీ బాసును మెప్పించేందుకు తమ పాత బాసులను, పార్టీలను అసెంబ్లీ సాక్షిగా చీల్చిచెండాడే ప్రయత్నం చేయవచ్చు కనుక ఇక తాను  నిశ్చింతగా సమావేశాలు నిర్వహించుకోవచ్చునని కేసీఆర్ ఆలోచిస్తున్నారేమో?

 

కానీ అంత మాత్రాన్న ప్రతిపక్ష పార్టీలు బెదిరిపోయే రకాలు కాదనే చెప్పవచ్చును. ఇప్పటికే తమ వద్ద ఉన్న అస్త్ర శాస్త్రాలన్నిటినీ వారు ఎలాగూ అధికార పార్టీపై ప్రయోగిస్తారు. ఈలోగా మరిన్ని కొత్తవి సిద్దం చేసుకోవచ్చును కూడా. మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేసీఆర్ తో చెడుగుడు ఆడుకొన్న రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సమావేశాలలో మెట్రో ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ముందే డిక్లేర్ చేసేసారు. కనుక బహుశః ఆయనిప్పుడు ఆ పని మీదనే బిజీగా ఉన్నందునే ఆటను మధ్యలో నిలిపివేసినట్లున్నారు. కనుక మిగిలిన భాగాన్ని శాసనసభలో పూర్తి చేస్తారేమో మరి చూడాలి.

 

ఇక కాంగ్రెస్ పార్టీ నేతలయితే మరో అడుగు ముందుకు వేసి ‘కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడే రోజులు దగ్గర పడ్డాయని’ డిక్లేర్ చేసేసారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా కరెంటు కష్టాలు, రైతుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చును. కానీ అన్ని విషయాలలో క్రెడిట్ క్లెయిం చేసుకొనే కేసీఆర్, ఈ క్రెడిట్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్, తెదేపాల ఖాతాలోనే జమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక వారు ఆ పాయింట్లు మాట్లాడినప్పుడు, కేసీఆర్ ఈ పాయింటే లేవనెత్తవచ్చును.

 

ఆయన ఇంకా బీజేపీకి కూడా అడ్డుకోవలసి ఉంది. కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ వారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు ఏవిధమయిన సహాయ సహకారాలు రాబట్టే ప్రయత్నాలు చేయకుండా తెలంగాణాను ‘ఇగ్నోర్’ చేస్తునందున వారికి కూడా ‘తెలంగాణా ద్రోహుల ట్యాగ్’ తగిలించి వారిని నిలువరించే ప్రయత్నం చేయవచ్చును.

 

ఆంద్ర ప్రభుత్వం తెలంగాణా అభివృద్ధిని అడ్డుకొంటోందని తిట్టిపోయడానికి కేసీఆర్ వద్ద పెద్ద చాంతాడంత లిస్టు ఉంది. ఆ వంకతో తెదేపాను మరోమారు తిట్టిపోసి, అటువంటి పార్టీకి గులాములు పనిచేస్తూ తెదేపా-తెలంగాణా యం.యల్యే.లు కూడా తెలంగాణా ద్రోహులని మరోమారు సర్టిఫై చేసేసి వారినీ నిలువరించడానికి ప్రయత్నించవచ్చును. కాగల కార్యం గందర్వులే చేసారన్నట్లు ఆ పనిని తెదేపా నుండి తెరాసలోకి జంపయిన తెదేపా సభ్యులే చక్కబెట్టవచ్చును. కనుక తెలంగాణా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల వద్ద యుద్ధం చేసుకోవడానికి కత్తులు డాళ్ళు సరి సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చును.