కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ

 

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్ష చేసింది తెలిసిందే.తాజాగా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో భేటీ అయ్యారు.రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఎంపీలు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎంపీలు కోరారు.కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.ఉక్కు కర్మాగారంపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని.. ఏపీకి ఏమీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారా? అని కేంద్ర మంత్రిని నిలదీసినట్లు ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు.తమ డిమాండ్లపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ఎంపీలు చెప్పారు. ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. వారం రోజుల్లో కేంద్రం తరఫున లేఖ విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.

కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇచ్చామని ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. భూమి, విద్యుత్‌, నీరు, మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంపై పగబట్టినట్లుగా వ్యవహరించవద్దని కోరినట్లు చెప్పారు.

టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్న డిమాండ్లు:

*కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి.
*కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలి.
*కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలి.
*కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా?
*కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అంటూ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.