బీజేపీ కమిషన్‌ గా మారిపోయిన ఎన్నికల కమిషన్

 

ఎన్నికల కమిషన్, బీజేపీ కమిషన్‌గా మారిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధాని కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్‌ను నడిపిస్తున్నారని ఆరోపించారు. రీపోలింగ్ కోసం తాము రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిస్తే స్పందించలేదు కానీ విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెల్ల కాగితం మీద ఫిర్యాదు ఇస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించిందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే పీఎంవో ద్వారా వైసీపీ ఎన్నికల కమిషన్‌ కి సిఫార్సు చేయించిందన్నారు. కుట్రలతో, డబ్బుతో ఆ ఐదు కేంద్రాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. తాము కోరిన 19 చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. రీపోలింగ్‌పై సీఈవో ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని, వీడియో సాక్ష్యం ఉండటంతోనే రీపోలింగ్‌కు ఆదేశించామని తెలిపారు. వీడియో చూస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అనిపిస్తుందని, ఘటన ఆలస్యంగా తెలియడంతో ఇప్పుడు రీపోలింగ్‌ చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన రిపోర్ట్‌లో వాస్తవం లేకపోతే సీఈసీ రీపోల్‌ జరపదని ద్వివేది పేర్కొన్నారు.