వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే.. బాబు చెప్పేదొకటి చేసేదొకటి

 

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకున్న మల్లిఖార్జున రెడ్డి తాజా పరిణామాలపై ఆయనతో చర్చించారు. టీడీపీ నుంచి మేడా మల్లిఖార్జున రెడ్డిని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మేడా మల్లిఖార్జున రెడ్డి జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గంజాయి వనం నుంచి తులసివనంలోకి వచ్చినట్టుంది. టీడీపీ అధినేత చెప్పేదొకటి చేసేదొకటి. నాలుగున్నరేళ్ల టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డా. వైఎస్ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చా. చంద్రబాబును ఓడించి జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. ప్రజాస్వామ్యం తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జగన్ పాదయాత్ర చేశారు. సంతలో పశువులను కొన్నట్లు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు. బుధవారం స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేస్తా' అని అన్నారు.

మరోవైపు రాజంపేట టీడీపీ టికెట్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. రాజంపేట టీడీపీ నేతలతో ఈరోజు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే వెళ్లిపోతారని అన్నారు. కడప జిల్లా కార్యకర్తలకు తాను అండగా ఉంటానంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీచేస్తారన్న దానిపై చర్చ జరిగింది. చంద్రబాబు ఆదేశిస్తే రాజంపేట నుంచి తాను పోటీ చేస్తానని తానా ప్రెసిడెంట్ వేమన సతీష్ తెలిపారు. రాజంపేట సీటు గెలిపించి సీఎంకు కానుకగా ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేడా సస్పెన్షన్ పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సతీష్ అన్నారు. మరి రాజంపేట సీటుని చంద్రబాబు సతీష్ కి కేటాయిస్తారో లేక వేరే ఎవరికైనా అవకాశమిస్తారో చూడాలి.