ప్రభుత్వం స్పందించకపోతే రైతాంగం తరపున ఉద్యమిస్తాం

జగిత్యాల, కామారెడ్డిలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని, సన్నరకం ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ తెలుగు దేశం తీవ్రంగా ఖండించింది. 

 

అరెస్టు చేసిన రైతులను బేషరతుగా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ప్రభుత్వమే రైతుల చేత సన్నరకాలు సాగు చేయాలని ప్రోత్సహించి ఇప్పుడు కనీస మద్దతు ధర కల్పించకపోవడం హేయమైన చర్య అని రాష్ట్ర తెలుగు దేశం అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ప్రభుత్వం వెంటనే సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు  రూ. 2,500 మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతాంగం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.