డిప్యూటీ స్పీకర్ పదవి కూడా టీడీపీకే?

 

 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి మీద వైకాపా చాలా ఆశలు పెట్టుకుంది. స్పీకర్‌ పదవికి తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి సహకరించినందుకు డిప్యూటీ స్పీకర్ పదవి తమ పార్టీకి దక్కుతుందని వైసీపీ ఎక్కువగా ఆశపడింది. నిన్న మొన్నటి వరకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం న్యాయం అంటూ న్యాయసూత్రాలు కూడా చెప్పింది. అయితే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి వదిలిపెట్టడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావును ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది. డిప్యూటీ స్పీకర్ పోస్టు కోసం శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23న ఎన్నిక వుంటుంది. ఇక గొల్లపల్లి సూర్యారావు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం లాంఛనమే. దీంతో వైసీపీ డిప్యూటీ స్పీకర్ కల కల్ల అయిపోయినట్టు భావించవచ్చు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్‌గా కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్‌లుగా బోండా ఉమ, కోన రవి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తోంది.