తెలంగాణా తెదేపా నేతల భవిష్యత్?

 

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమిని గెలిపించేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా కృషిచేసారు. కానీ బలమయిన తెలంగాణా సెంటిమెంటు ముందు ఎన్డీయే కూటమి నిలవలేక ఓడిపోయింది. కానీ ఆంద్రప్రదేశ్ లో వారి కూటమి ఘన విజయం సాధించడంతో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆప్పటి నుండి ఆయన రాష్ట్ర పాలన, దాని సమస్యల పరిష్కారం, తెలంగాణా ప్రభుత్వంతో వివిధ అంశాలపై యుద్ధం చేయడంలో క్షణం తీరికలేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికలలో ఓటమితో డీలా పడిపోయిన తన పార్టీ తెలంగాణా నేతలు, కార్యకర్తలకు ఆయన దైర్యం చెపుతూ ఇకపై తాను తెలంగాణా తెదేపా శాఖపై, తెలంగాణా రాజకీయాలపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టి, అక్కడ కూడా పార్టీని మరింత పటిష్టం చేసి, వచ్చే ఎన్నికలలో పార్టీ తప్పకుండా గెలిచేలా చేస్తానని కొద్ది రోజుల క్రితం తెలిపారు. తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకే ఆయన ఇంకా హైదరాబాదును అంటిపెట్టుకొని ఉన్నారని కొందరు పార్టీ నేతలు చెపుతున్నారు. అంతే కాదు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇకపై తరచుగా తాను తెలంగాణాలో కూడా పర్యటిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారనే విషయం అందరికీ కనబడుతూనే ఉంది.

 

ఏ రాజకీయ నాయకుడయినా తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే కోరుకొంటాడు. కనీసం దానిపై ఎంతో కొంత స్పష్టత అయినా ఉండాలని కోరుకొంటాడు. అటువంటప్పుడు తెలంగాణా తెదేపా నేతలు కూడా ఆవిధంగానే కోరుకోవడం సహజమే. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెదేపా నేతలు, ఇప్పుడు మళ్ళీ మరో ఐదేళ్ళ వరకు వేచి చూడక తప్పడం లేదు. అయినా అప్పటి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ వైపు దృష్టి సారించలేని పరిస్థితిలో ఉండటంతో వారిలో క్రమంగా నిరాశ నిస్పృహలు కలగడం సహజమే. అయితే ప్రస్తుతం వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవారు కాని, కనీసం ఆ విషయం గురించి సానుభూతితో చర్చించేవారు కానీ లేకపోవడంతో వారు తీవ్ర అభద్రతా భావానికి గురవడం సహజమే. బహుశః ఈ పరిస్థితులే పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని అధికార తెరాస పార్టీ వైపు ఆకర్షింపబడేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఆయన ఖమ్మం జిల్లాలో మరో నేత నామా నాగేశ్వరావుతో ఏర్పడిన విభేదాల కారణంగానే పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారని చెప్పుకొంటున్నా, వాస్తవానికి తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందనే భయంతోనే ఆయన తెరాస వైపు ఆకర్షితులవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

అందుకు ఉదాహరణగా తెరాసలో చేరేందుకు క్యూ కడుతున్న వైకాపా నేతలను చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇక తెలంగాణాలో పోటీ చేసే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు అక్కడి పార్టీ నేతల రాజకీయ భవిష్యత్ అంతా శూన్యమే. కనుక వారు తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలో పార్టీని కాపాడుకొంటూ, ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంది.

 

పార్టీలో ముఖ్యమయిన తెలంగాణా నేతలు కొందరికి మోడీ మంత్రివర్గంలో పదవులు, కేంద్రం చేతిలో ఉండే కొన్ని నామినేటడ్ పదవులలో నియామకాలు చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అది చాల మంచి ఆలోచనే కానీ తెలంగాణాలో పార్టీని కాపాడుకొనేందుకు ఆ ప్రయత్నాలు ఏ మాత్రం సరిపోవు. చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రద్ధ తీసుకొని పార్టీ నేతలు, కార్యకర్తలకు వారి రాజకీయ భవిష్యత్తుపై నమ్మకం కలిగించే విధంగా ప్రణాళికలు, కార్యక్రమాలు తయారు చేయవలసి ఉంటుంది. వీలయినంత తరచుగా పార్టీ తెలంగాణా నేతలతో, కార్యకర్తలతో సమావేశామవుతూ, వారిని ఉత్సాహపరుస్తూ మార్గదర్శనం చేయవలసి ఉంటుంది. లేకుంటే మిగిలిన నేతలు వారి అనుచరులు కూడా తుమ్మలను అనుసరిస్తూ అధికార తెరాసవైపు నడిచే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.