పవన్ సినిమాలే కాపీ..పొలిటికల్‌గా కాదంటోన్న విజయ్
posted on Jul 4, 2025 10:19PM

డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ 'సీఎం కేండెట్ నేనే'నంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఆయన ఎవరితోనూ పొత్తులుండవ్. అంతా ఓన్ గా పవర్ లోకి రావడమే అంటూ కుండ బద్ధలు కొట్టేశారు. నా పార్టీ సీఎం అభ్యర్ధిగా నేనే ఉంటానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, కఠినమైన తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంత వరకూ రాణించగలరు? అన్నదొక డిబేట్. కారణం ఇక్కడ జయ తర్వాత ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. దానికి తోడు ఆమె నెచ్చెలి శశికళ సైతం రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. ఇక్కడొక వ్యాక్యూమ్ ఉన్న మాట నిజమే. అయితే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ మాస్ ఇమేజీని సొంతం చేసుకుని విజయ్ సీఎం పీఠం ఎక్కగలరా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.
బేసిగ్గా దళిత సామాజిక వర్గానికి చెందిన 'విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్'(పూర్తి పేరు) ని ఇక్కడి ఓటర్లు ఎంత వరకూ ఆదరిస్తారు? అన్న క్వశ్చన్లు కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ కులాలైన పన్నియార్లు, గౌండర్లు డీఎంకే, అన్నాడీఎంకేలుగా చీలిపోయాయి. ఇవిలా ఉంటే తమిళనాట గల కులాల వారీ శాతాలను పరిశీలిస్తే విజయ్ ప్రాతినిథ్యం వహించే దళిత ఓటు బ్యాంకు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉంది. మిగిలిన 80లో అరవై శాతం బీసీలు, ఇంకో ఇరవై శాతం మరకూ ఇతర కులాలు ఉన్నాయి. కొంత కాలంగా దళిత పాంతర్స్ పార్టీ తమిళనాడు లో కూడా ఉంది. కానీ అది ఇప్పటి వరకూ ఏమంత ప్రభావం చూపించలేదు.ఇక వాటీజ్ విజయ్ ఆయన కెపాసిటీ ఏంటి? పూర్వాపరాలు ఎలాంటివని చూస్తే.. తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కాగా, తల్లి కర్ణాటక సంగీత కళాకారిణి. విజయ్ కి ఒక చెల్లెలు కూడా ఉండేది. పేరు దివ్య. అయితే ఆమె తన రెండో ఏటనే చనిపోయింది. ఆమె పేరిట దివ్య విజయ్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించడం మాత్రమే కాకుండా శుక్రన్ సినిమాలో ఆమె బొమ్మ కూడా చూపించాడు విజయ్.
తండ్రి తీసిన వెట్రి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ పదమే తన పార్టీ పేరులోనూ పెట్టుకున్నారాయన. విజయ్ పార్టీ పేరు 'తమిళిగ వెట్రి కళగం'. ఇక కమ్యూనికేషన్ లో పట్టా తీసుకుందాం అనుకున్న విజయ్ కి ఎలాగైనా సరే హీరో కావాలని ఉండేది. దీంతో డిగ్రీ మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసి వచ్చేశాడు. 18 ఏళ్ల వయసులో తండ్రి చంద్రశేఖర్ తీసిన 'నాలై తీర్పు' అనే చిత్రంలో తాను హీరోగా, కీర్తన హీరోయిన్ గా నటించారు. విచిత్రమేంటంటే తన తండ్రి చిత్రమే అయినా.. ఆడిషన్స్ లో పాల్గొని మరీ సెలెక్ట్ అయ్యాడు విజయ్. ఆ టైంలో విజయ్ కొట్టిన డైలాగ్ అన్నామలైలో రజనీకాంత్ డైలాగ్. అందుకే విజయ్ 'రజనీకాంత్ లేకుంటే తాను లేనని' అంటారాయన. ఇదిలా ఉంటే, తమిళనాట విజయ్ హవా.. 'రసిగన్' మూవీతో ఒక్కసారిగా పెరిగింది. విజయ్ కీ మన తెలుగు వారికీ ఉన్న అనుబంధం ఎలాంటిదంటే.. ఆయన గల్లి, పోకిరి, బద్రీ వంటి తెలుగు చిత్రాలు రీమేక్ చేసి మరీ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. వీటిల్లో పవన్ కళ్యాణ్ సినిమా బద్రి కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. "పవన్ కళ్యాణ్ ని తాను తెరపై కాపీ కొట్టానేమోగానీ తెరబయట- రాజకీయంగా కాదని" అంటున్నారాయన. తాను సొంత కాళ్లపై రాజకీయాల్లో నిలబడతానని అంటారు.
2017లో హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో 2వ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్- తనే. మెర్సల్, తరీ, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు వంద, నూట యాభై, రెండు వందల కోట్ల వరకూ వసూల్ చేశాయి. బీస్ట్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్సన్ల పరంగా విజయ్ కింగే అని నిరూపించింది. విదేశాల్లో రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ విజయ్. బేసిగ్గా విజయ్ స్థానంలో అజిత్ ఇలాంటి పొలిటికల్ డయాస్ పైకి రావల్సింది. జయలతిత ఎంతో ముందు చూపుకొద్దీ.. 'తల' అజిత్ ని ఎంకరేజ్ చేయాలని చూశారు. కానీ ఆయనేమంత రియాక్ట్ కాలేదు. తానేంటో తన రేసింగ్ ఏంటో.. మూవీస్ ఏంటో.. అన్నట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతానికి కూడా అజిత్ నుంచి పెద్దగా పొలిటికల్ రియాక్షన్ లేదు.
కానీ తన తండ్రి ప్రేరణో లేక, మరొకటో తెలీదు కానీ.. విజయ్ మాత్రం అనూహ్యంగా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ దళిత్ కమ్యూనిటీ ఇక్కడ సిఎం పోస్టు వరకూ ఎదగలేదు. ఈ కొరత తీర్చడం కోసమైనా ఆయన ఈ పార్టీ, దాని నిర్వహణ చేయాలని భావించినట్టుగా కనిపిస్తోంది.అయితే తమిళ రాజకీయాల్లో కులాల ప్రస్తావన అధికంగా ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఆయన భారీ ఎత్తున అక్కడి లీడింగ్ క్యాస్ట్ లీడర్స్ ని తన పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న రోజా సైతం టీవీకేలోకి రావడానికి ఉత్సాహం చూపించగా.. అవినీతి మరక గల వారు మాకొద్దని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం. అయితే భర్త ఆర్కే సెల్వమణి దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కావడంతో.. ఆమెకు తలుపులు ఇంకా మూసుకుపోలేదని కూడా అంటారు.
ఇదంతా ఇలాగుంటే అవినీతి మరక అంటని రాజకీయ నేతల్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించనలవి కాదు. అయితే విజయ్ తన తొలినాళ్లలో అభిమానులకే అధిక ప్రాధాన్యతనిచ్చేలా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు చూసుకున్న తర్వాత.. ఆయన రాజకీయ ధోరణిలో ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. అప్పటి వరకూ విజయ్ ఎన్ని కామెంట్లు చేసినా.. వాటికి పెద్దగా విలువనిచ్చేలా కనిపించడం లేదు. గతంలో అంటే, 2005లో తమిళ సినిమా ఫీల్డు నుంచి విజయ్ కాంత్ రూపంలో 'డీఎండీకే' అనే పార్టీ పెట్టడం.. ఆయన పెద్దగా ప్రభావం చూపలేక పోవడం అన్నది విజయ్ కి సవాల్ విసురుతోంది. దీన్నిబట్టీ చూస్తే తమిళనాట సినిమా వారి ప్రాధాన్యత.. ఒక ముగిసిన అధ్యాయం అనేవారున్నారు. అయితే అది అప్పుడు- ఇప్పుడు కాదంటారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. దానికి తోడు ఎక్కడో 'ఆంధ్ర సినీ పొలిటీషియన్ పవన్' మన వరకూ వచ్చేస్తున్నాడు. కాబట్టి మనం అలెర్ట్ కావాలి. ఇక్కడున్న లోకల్ పొలిటికల్ టాలెంట్ ని పబ్లిక్ ఎంకరేజ్ చేయాలన్న కోణంలో విజయ్ తమిళ రాజకీయ తెరపైకి దూసుకొస్తున్నారు. మరి చూడాలి.. ఈ కామెంట్లలోని దమ్ము తన రాజకీయాల్లో ఆయన ఏ విధంగా కొనసాగిస్తారో లేదో తేలాల్సి ఉంది