చిక్కుల్లో స్వామిగౌడ్
posted on May 23, 2012 1:47PM
తెలంగాణా ఉద్యోగసంఘాల జెఎసి ఛైర్మన్ స్వామిగౌడ్ అనూహ్యంగా వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సాకుతో ఉద్యోగసంఘాన్ని నిట్టనిలువునా చీల్చిన స్వామిగౌడ్ కొద్దినెలల క్రితం జరిగిన సకల జనుల సమ్మెలో కీలకపాత్ర పోషించారు. ఈ సకలజనుల సమ్మె విఫలమైనా స్వామిగౌడ్ మాత్రం బాగానే లాభపడ్డారని ఒక మంత్రి ద్వారా ఆయనకు భారీగానే ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తెలంగాణా ఉద్యోగులు మరిచిపోతున్న తరుణంలో ఆయనపై మరో అపవాదు పడింది.
తెలంగాణా ఎన్ జీఓ కోఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీలో స్వామిగౌడ్ అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలతో ప్రస్తుతం ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక కన్నీళ్లపర్యంతమవుతున్నారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు తెలంగాణా ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచిన తెలంగాణా ఉద్యోగసంఘాల జెఎసిని, టిఎన్ జీఓను, తనను అప్రదిష్టపాలు చేయటానికి కంకణం కట్టుకున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కు అత్యంతసన్నిహితుల్లోస్వామిగౌడ్ ఒకరు. పొలిటికల్ జెఎసి చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ను తొలగించి ఆ పదవిని స్వామిగౌడ్ కు కట్టబెట్టాలని కెసిఆర్ యోచిస్తున్న తరుణంలో ఆయనపై ఈ ఆరోపణలు రావటం విశేషం.