ఇకపై అలాంటి రాజకీయ నేతల పప్పులు ఉడకవు...
posted on Nov 1, 2017 5:44PM

దోషులుగా ముద్ర పడిన రాజకీయ నాయకులు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఆరు సంవత్సరాల తరువాత ఎంచక్కా మళ్లీ రాజకీయాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారి పప్పులు ఉడికే ఛాన్స్ లేదు. దీనిపై సుప్రీంకోర్టు ఓ సంచలన నిర్ణయం తీసుకోనుంది. కోర్టులు దోషులుగా తేల్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై యావజ్జీవ నిషేధం విధించాలని ఈసీ (ఎన్నికల సంఘం) ఈ మధ్య కోర్టులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలసిందే. ఇక దీనిపై విచారించిన కోర్టు... ఈ సమస్యపై ఈసీ అభిప్రాయమేమిటో స్పష్టంగా లేదని.. ఏదో ఒకటి చెప్పండి.. నాన్చొద్దు అని ఆదేశించింది. దీంతో ఎన్నికల కమిషన్ బుధవారం తన నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. దోషులుగా ముద్ర పడిన రాజకీయ నాయకులకు యావజ్జీవ నిషేధం విధించాలని కోరింది. ఈసీ వైఖరి తెలిసిపోయింది గనుక ఇక ఈ సమస్య చిక్కు ముడి వీడిపోయినట్టే అని జడ్జీలు పేర్కొన్నారు. మొత్తానికి ఇక దోషులుగా గుర్తింపు పొందిన నేతలకు గడ్డు కాలమే..