వేసవిలో దాహం తీర్చుకోవడం ఓ కళ!

 


వేసవి మొదలైపోయింది. అది కూడా ఉధృతంగా! ఇంతటి వేసవిని ఎదుర్కోవాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని అందరూ చెప్పేమాటే! ఒంట్లో తగినంత నీరు లేకపోతే ఇంటపట్టునే ఉన్నా సమస్యలు తప్పవు. చెమటపొక్కుల దగ్గర్నుంచీ విరేచనాల దాకా.... నీరు తాగకపోవడం అనే సమస్య ఒకోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. మరి ఈ చిక్కుని విప్పాలంటే...

 

మద్యంతో అసలుకే మోసం – వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది చల్లటి బీరు తాగితే చాలనుకుంటారు. ఆల్కహాల్‌తో శరీరానికి నీరు దొరక్కపోగా, ఉన్న నీరు కూడా పోతుందంటున్నారు నిపుణులు. మద్యం మన శరీరంలో ఉండే anti-diuretic అనే హార్మోను మీద ప్రభావం చూపుతుందట. దీని వల్ల శరీరం అవసరమైనదానికంటే అదనపు నీటిని కోల్పోతుందంటున్నారు. అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని వేరే చెప్పాలా!

 

లెక్కలు పక్కన పెట్టండి – రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలా? రెండు లీటర్ల నీరు తాగాలా? లాంటి సందేహాలను పక్కన పెట్టండి. దాహం వేసినప్పుడల్లా కావల్సినంత నీరు తాగాలి. దాహం వేయనప్పుడు కూడా తరచూ నీరు తాగుతూనే ఉండాలి.

 

కూల్‌డ్రింక్స్‌ దండగ – ఎండాకాలం వచ్చిందంటే మనకి శీతల పానీయాలే గుర్తుకువస్తాయి. వీటిలో ఉండే చల్లదనం వల్ల, కార్బన్‌డయాక్సైడ్‌ వల్ల దాహం తీరినట్లు తోస్తుంది. కెఫిన్‌, చక్కెర వంటి పదార్థాల వల్ల తాత్కాలికంగా ఉత్సాహం కలుగుతుంది. ఫలితంగా మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. శీతల పానీయాల వల్ల శరీరానికి తగినంత నీరు దక్కదు సరికదా... రక్తపోటు, కిడ్నీల సమస్యలు కూడా రావచ్చు.

 

వాటర్‌ బాటిల్‌ వెంట ఉండాల్సిందే – ఎండాకాలం బయటకి వెళ్లేటప్పుడు, పనిలో మునిగిపోయినప్పుడు దాహం వేయడం సహజం. పక్కన మంచినీళ్ల బాటిల్‌ లేకపోతే తరువాత తాగొచ్చులే అన్న నిర్లక్ష్యం ఏర్పడిపోతుంది. ఒకోసారి అప్పటికే ఒంట్లో జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోతుంది. మన ఒంట్లో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. ఈ నీటి శాతంలో మార్పులు వచ్చినప్పుడు తిప్పలు తప్పవు.

 

పోషకాహారం – మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సత్తువ ఎలాగూ ఉంటుంది. ఇక తాజా పండ్లు, కూరగాయల సలాడ్స్, వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తినడం వల్ల వాటి ద్వారా కావల్సినంత నీరు కూడా ఒంట్లోకి చేరుతుంది.

 

సూచనలు పట్టించుకోండి – మూత్రం పచ్చగా రావడం, నోరు పొడిబారిపోవడం, తలనొప్పి, కళ్లు మంటలు, చర్మం గరుకు తేలడం వంటి సవాలక్ష సూచనల ద్వారా మన ఒంట్లో తగినంత నీరు లేదని శరీరం సూచిస్తూ ఉంటుంది. వీటిని విస్మరిస్తే మరింత తీవ్రమైన సూచనలకు సిద్ధంగా ఉండాల్సిందే!

 

వ్యాయామంతో జాగ్రత్త- ఎండాకాలం వ్యాయామం చేసినప్పుడు చెమటతో పాటుగా నీరు, సోడియం రెండూ కూడా బయటకు వెళ్లిపోతాయి. అందుకని వ్యాయామం చేసే ఒక గంటకు ముందు పుష్కలంగా మంచినీరు తాగాలి. అలాగే వ్యాయామం చేసిన తరువాత కాసేపటికి కూడా నీరు తాగాలి. నీటికి బదులుగా కొబ్బరినీళ్లు, పళ్లరసాలు తీసుకుంటే మరీ మంచిది.

- నిర్జర.