ఈ ఎండలు మనకు పరీక్షలు

 

ఒక వారం రోజులుగా ఏ పత్రికను తిరగేసినా ‘భానుని భగభగలు’, ‘మండుతున్న ఎండలు’ లాంటి శీర్షికలే కనిపిస్తున్నాయి. వీటిలో పెద్దగా అతిశయోక్తి లేదు కూడా! గత దశాబ్ద కాలంగా కనీవినీ ఎరుగని ఎండలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ మాసంలోనే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎండలకు మారుపేరైన హైదరాబాదులో కూడా నలభై ఏళ్ల రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం హైదరాబాదే కాదు, తెలుగునాట చాలా ప్రాంతాలలో సాధారణం కంటే 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది.

 

గురువారం నాడు 51 మంది మృతి, శుక్రవారం నాడు 50 మంది మరణం! ఇవేమీ రోడ్డు ప్రమాదాలలో మరణించినవారి గణాంకాలు కాదు. కేవలం వడదెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల సంఖ్య. ఇక పరోక్షంగా వేసవి తాపానికి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్యా తక్కువేమీ ఉండదు. డీహైడ్రేషన్‌ వల్ల గుండెపోటు లేదా పక్షవాతం రావచ్చు. కలుషిత నీరు వల్ల జీర్ణకోశం దెబ్బతినిపోవచ్చు. ఇలా వేసవి ఎండకు బలయ్యేవారు కొందరైతే, ఆ ఎండ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు ప్రాణాపాయ స్థితిలో పడిపోతారు. అందుకే వేసవిలో ఈతకని వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వార్తలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. వేసవినాటి పొడివాతావరణంలో అగ్నిప్రమాదాలకు కూడా కొదవు ఉండదు.

వేసవి తాపం నుంచి బయటపడేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది! వాటి గురించి కావల్సిన సమాచారం మన చుట్టూ ఎలాగూ లభిస్తోంది. తగినంత మంచినీరు తీసుకోవడం, ఎండ వేళల్లో నీడపట్టున ఉండటం, బయటకు వెళ్లినప్పుడు ఎండ తగలకుండా తగిన రక్షణతో ఉండటం, ఎలాంటి అనారోగ్యం కలిగినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం.... ఇలాంటి ప్రాథమిక జాగ్రత్తలు చాలా ఉపయోగంగా ఉంటాయి. కాకపోతే సెలవులనగానే ఆటల్లో పడిపోయే పిల్లల మీద ఓ కన్నేసి ఉంచడం మాత్రం అత్యవసరం! పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్లు ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న విషయాన్ని గమనించుకోక తప్పదు.

 

ఈసారి వేసవి తీవ్రంగా ఉండటానికి నిపుణులు చాలా కారణాలే చెబుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, భూ ఉపరితలం త్వరగా వేడెక్కే అవకాశం చిక్కింది. ఈ వేసవిలో చాలా ప్రాంత ప్రజలు దాహంతో ఎండిపోవడానికి కూడా ఎల్‌నినో ఒక ప్రధాన కారణం. వీటికి తోడు ఉత్తరాది వీస్తున్న వేడిగాలులు, ఈ వేసవిని మరింత మండిస్తున్నాయి. ఏటా ఈ గాలుల నుంచి ఉపశమనంగా, బంగాళాఖాతం నుంచి వీచే గాలులు కూడా ఈసారి స్తంభించిపోవడంతో, వేసవి వేడి అనుభవానికి వస్తోంది. ఈ ఎల్‌నినో శాపం ఇక్కడితో ఆగేట్లు కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావం చూపిన మరుసటి సంవత్సరం కూడా రుతుపవనాలు ఆలస్యమవుతాయంటూ ఒక వాదన వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే ఈసారి తొలకరి కోసం జూన్ చివరి వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుందేమో!

 

వేసవి ఉక్కపోత నుంచి జనాలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు తెలుగు ప్రభుత్వాలు ఈసారి కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే హైదరాబాదులో తాగునీటి సమస్య అదుపులోనే ఉంది. ఇక బడులకు కూడా వారం ముందుగానే సెలవులను ప్రకటించారు. అన్నింటికీ మించి, వేసవి ఉక్కపోతకు తోడుగా నిలిచే విద్యుత్‌ కోతలు ఈసారి తెలుగు రాష్ట్రాలలో లేకపోవడం శుభసూచకం. కానీ ఏటా వేసవి రాగానే విద్యుత్ గురించీ, నీటి గురించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే రోజులు మారాలి. దేశంలో కావల్సినంత ఎండ నెత్తిన మాడుతున్నా, ఆ ఎండను సౌరవిద్యుత్తుగా మార్చుకునే దిశగా ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు అంతంతమాత్రమే! తెలంగాణలో తాగునీటి కోసం, ఆంధ్రాలో సాగు కోసం బోర్లను ఎడాపెడా తవ్వేస్తున్న వైనం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ తవ్వకం మీద సరైన పర్యవేక్షణ కానీ, నిషేధం కానీ లేవు. ఇక వర్షపాతాన్ని పూర్తిగా ఒడిసిపట్టేందుకు చేపడుతున్న చర్యలూ నామమాత్రంగానే సాగుతున్నాయి. వనరులను దాచుకునే, ఉపయోగించుకునే ప్రయత్నాలు మాని ఉన్నవాటిని తుదివరకూ వాడుకోవడం భవిష్యత్ తరాలకు ఏమంత శుభ పరిణామం కాదు. కాబట్టి వేసవిలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధగా ఉండాలని ప్రభుత్వాలు ఎంతగా కోరుకుంటాయో, ప్రభుత్వాలు వనరుల గురించి శ్రద్ధ చూపించాలని ప్రజలు కూడా కోరుకోవడంలో తప్పులేదు!