ఎండ‌ల‌తో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌.. బ‌య‌ట‌కు రావొద్దంటూ అడ్వైజ్‌..

ఎండ‌లు మండిపోతున్నాయ్‌. మార్చిలోనే మంట పుట్టిస్తున్నాయ్‌. రికార్డు స్థాయిలో టెంప‌రేచ‌ర్ న‌మోద‌వుతోంది. ఉత్త‌రాధి నుంచి వేడిగాలులే ఇందుకు కార‌ణం అంటున్నారు. స‌డెన్‌గా పెరిగిన ఎండ‌ల‌తో మంట పుడుతోంది. తెలంగాణ బేజార్ అవుతోంది. ఏపీలోనూ ఉక్క‌బోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆంధ్రాతో పోలిస్తే.. తెలంగాణ‌లో ఎండ‌ల తీవ్ర‌త దారుణంగా ఉంది.

ఉష్ణోగ్ర‌త‌లు అనూహ్యంగా పెర‌గ‌డంతో.. తెలంగాణ‌లోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ప్రజారోగ్య శాఖ సంచాలకులు-డీహెచ్‌ శ్రీనివాసరావు ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు చేశారు. 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటుండ‌టంతో.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. 

ఎండ తీవ్ర‌త‌కు వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి అడేలా చూడాలని.. అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల‌ని సూచించారు. బయట తిరిగేవాళ్లు ఎక్కువగా నీళ్లు, పానీయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రావొద్దని చెప్పారు. కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారం తీసుకోవద్దని సూచించారు.  

రాబోయే నాలుగు రోజులు తెలంగాణ‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఏప్రిల్‌ ఒకటి, రెండు తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదముందని తెలిపింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదవుతున్నాయి. 

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లోని ప్రస్తుత ఉష్ణోగ్రతలు, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్యశాఖ ద్వారా అందుబాటులో ఉన్న ఔషధాలు, సప్లిమెంటరీ ట్యాబ్లెట్లు, సిర్‌పలు, ఓరల్‌ రీ-హైడ్రేషన్‌ సొల్యూషన్‌(ఓఆర్‌ఎస్‌) ప్యాకెట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాగా, వడదెబ్బ బాధితులకు వీలైనంత త్వరగా చికిత్స అందించేందుకు జిల్లాల్లో ర్యాపిడ్‌ రెన్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు జిల్లా మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్‌ మీడియా సాయంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్ర‌జ‌లంతా ఎండ తీవ్ర‌త నుంచి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News