సుమన్‌ పద్ధతి అస్సలు బాలేదు..

 

హీరో సుమన్ మరీ అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ పరువు అడ్డంగా తీసేవిధంగా ఆయన గారి వ్యవహార శైలి వుంది. ఏదో ముద్దుగా బొద్దుగా వుంటాడు... వేంకటేశ్వరుడు, రాముడు లాంటి మంచి మంచి పాత్రలు ధరించాడు.. రాముడు మంచి బాలుడు తరహాలో వుంటాడని ఇంతకాలం అనుకున్నాం గానీ, మరీ ఇంత ఇంత దారుణంగా వ్యవహరిస్తాడని కలలో కూడా అనుకోలేదమ్మా! లేకపోతే ఏంటండీ... మన దర్శకుడు గుణశేఖర్ మీద సుమన్ ఛీటింగ్ కేసు పెట్టాడు.. తాను ‘రుద్రమదేవి’ సినిమాలో నటించిన సందర్భంగా తనకు గుణశేఖర్ ఐదు లక్షలు బాకీ వున్నాడని, ఆ ఐదు లక్షలకు తనకు గుణశేఖర్ చెక్కు ఇచ్చాడని, ఆ చెక్కు బ్యాంకులో వేస్తే బౌన్స్ అయిందని కేసు పెట్టాడు. చెక్కు బౌన్సయింది బాబూ అని సదరు సినిమా మేనేజర్ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందట. తానే స్వయంగా సినిమా ఆఫీసుకి వెళ్ళి అడిగినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందట. అంతే, సుమన్‌కి ఎక్కడో కాలి గుణశేఖర్ మీద అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఛీటింగ్ కేసు పెట్టాడు. ఇది నిజంగా దారుణమైన విషయం... ఎక్కడో తమిళనాడు నుంచి బతకడానికి మన దగ్గరకి వచ్చి, మన సినిమాల్లో యాక్ట్ చేసి, మన తెలుగింటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్న సుమన్... ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ మీదే కేసు వేస్తాడా?.. హమ్మా!

 

అయినా ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని సుమన్ కేసు వేశాడు? ఆఫ్ట్రాల్ ఐదు లక్షల కోసం కేసు వేస్తాడా? గుణశేఖర్‌కి కోపం వచ్చిందంటే ఆ ముష్టి ఐదు లక్షలకి వడ్డీ కూడా కలిపి సుమన్ ముఖం మీద కొట్టేస్తాడు. అయితే ఆయనకు ఎవరిమీదా కోపం రాదు అదీ సమస్య. అయినా గుణశేఖర్ ఏమంత పెద్ద నేరం చేశాడంట? ఏదో అలా ఒక చెక్కిచ్చాడు.. దాన్ని బ్యాంకులో వేస్తే ఇలా బౌన్సయి వచ్చింది. ఇది నేరమా? ఇది ఘోరమా? ఇది అన్యాయమా? ఇది అధర్మమా? చెక్కు బౌన్స్ కావడం ఎక్కడైనా నేరమేమోగానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎంతమాత్రం నేరం కాదు. సినిమావాళ్ళు ఇచ్చిన చాలా చెక్కులు నాలుకలు గీసుకోవడానికి కూడా పనికిరావన్న విషయం సుమన్‌కి తెలియదా? చెక్కులు బౌన్స్ చేయడం సినిమా ఇండస్ట్రీ జన్మ హక్కు. సినిమావాళ్ళు వంద చెక్కులు ఇచ్చారంటే వాటిలో రెండో మూడో మాత్రమే క్యాష్ అవుతాయనన్న నగ్న సత్యం ఇన్నాళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సుమన్‌కి అర్థం కాకపోవడం బాధాకరం. మొన్నామధ్య జీవితమ్మ ఇచ్చిన పాతికేసి లక్షల చెక్కులు రెండు బౌన్స్ అవడం.. అందులో ఒక కేసులో ఆమెకు జైలు శిక్ష పడటం... ఆమె కోర్టులో పాతిక లక్షలు చెల్లించి బయటపడటం ఇవన్నీ సుమన్‌కి తెలియవా? ఇవన్నీ తెలిసి కూడా సుమన్ చెక్కు బౌన్సయింది దేవుడో అని పోలీస్ స్టేషన్‌కి ఎక్కడం విచిత్రంగా వుంది. సినిమాలకు పనిచేయాలి. డబ్బులిస్తే తీసుకోవాలి. ఇవ్వకపోతే నోరు మూసుకోవాలి. ఇచ్చిన చెక్కులు బౌన్సయితే లైట్‌గా తీసుకోవాలి. లోపల్లోపల కుళ్ళుకుని బాధపడాలి. అంతేగానీ, పోలీస్ స్టేషన్‌కి ఎక్కి కేసు పెడతారా? అసలీ దేశంలో న్యాయం, ధర్మం బతికే వున్నాయా?