త్వరలో మరో కోర్ కమిటీ సమావేశం

 

రాష్ట్ర విభజన చేసి ఒక గొప్ప సమస్యను పరిష్కరించిన ఘనత, దానితో బాటే ఎన్నికలలో రాజకీయ లబ్దిపొందాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ప్రకటించింది. అయితే అది ఊహించని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయ్యి, అది నానాటికి ఉద్రుతమవుతోందే తప్పతగ్గే సూచనలు కనబడటం లేదు. అయితే కధ ఇంతవరకు వచ్చిన తరువాత అటు కేంద్రం, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్న ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. అయినప్పటికీ ఇంత కాలం సోనియా గాంధీ విదేశాలకి వెళ్ళిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి చొరవ చూపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. పైగా హోంమంత్రి షిండే సోనియా గాంధీ రాగానే ‘తెలంగాణా నోట్’పై తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పడం సీమాంధ్ర ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లు మండిపడ్డారు. తత్ఫలితంగా ఉద్యమాలు మరింత తీవ్ర తరం చేసారు. చివరికి నిన్న రాత్రి నుండి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకి దిగారు.

 

నిన్న సోనియా గాంధీ స్వదేశం తిరిగి రావడంతో ఈ రోజు సాయంత్రం లేదా రేపు కోర్ కమిటీ అత్యవసర సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించి, దానిని బట్టి రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళాలా లేక తాత్కాలికంగా కొంచెం స్పీడు తగ్గించాలా? అనేది నిర్ణయించుకోవచ్చును. ముందుగా రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో తీసుకువచ్చేందుకు తగిన చర్యలు చేప్పట్టి, ఆ తరువాత తెలంగాణా నోట్ పై ముందుకు సాగే అవకాశం ఉంది.