ఆర్నెళ్లలో 30వేల కోట్ల అప్పు..! దుబారా ఖర్చు తగ్గిస్తామంటూనే ప్రజాధనం దుర్వినియోగం

 

దాదాపు అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో లక్షన్నర కోట్లలోపు అప్పు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత సుమారు 88వేల కోట్ల రూపాయల రుణం ఏపీ వాటాగా వచ్చింది. ఇక, నవ్యాంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు అది రెండున్నర లక్షల కోట్లకు చేరింది. అంటే, ఐదేళ్లలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పు పెరిగింది. ఏడాదికి 30వేల కోట్ల చొప్పున అప్పు చేశారు. అయితే, ఆర్నెళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... దూకుడుగా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒకవైపు పన్ను రాబడి తగ్గింది... మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందని పరిస్థితి... అయినాసరే జగన్ మాత్రం పథకం మీద పథకాన్ని ప్రకటిస్తూ... ప్రజల మన్ననలు పొందాలని తాపత్రయం పడుతున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న... అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ ట్రిక్ ఏమిటో మంత్రులకు కూడా అంతుపట్టడం లేదు. కొందరు మంత్రులైతే బహిరంగ వేదికలపైనే తమ మనసులో మాటను బయటపెడుతున్నారు.

అయితే, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన ఆర్నెళ్ల పాలనలో 28వేల కోట్ల రూపాయల అప్పుల భారం మోపారని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గిస్తామంటూనే కేవలం ఆర్నెళ్లలో దాదాపు 30వేల కోట్ల అప్పులు చేశారని, ఇలాగైతే ఏడాదికి 60వేల కోట్లు... ఐదేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం ఖాయమన్నారు. అలాగే, హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంట్లో సౌకర్యాల కోసం లక్షల లక్షల ప్రజాధనాన్ని కేటాయించడం... అదేవిధంగా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ కు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఏమిటని ప్రశ్నించారు. దుబారా తగ్గిస్తామంటోన్న జగన్మోహన్ రెడ్డి... ఇలా ప్రజాధనాన్ని సొంత ఇళ్ల కోసం వినియోగించడం సరికాదన్నారు. అలాగే, ప్రజలపై మరింత అప్పుల భారం మోపకుండా పాలన సాగించాలని సూచించారు.