వైఎస్ వివేకా హత్య కేసు.. ఒక్కసారిగా దర్యాప్తు వేగం పుంజుకుంది

 

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. జగనకు సమీప బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డిలను సిట్ అధికారులు పిలిపించి ప్రశ్నించారు. అలాగే టిడిపికి చెందిన శివరాఘవరెడ్డి సహా ఇద్దరు టిడిపి నేతలను సిట్ బృందం ప్రశ్నించినట్లు సమాచారం. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తున్నా.. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను ఎందుకు పట్టుకోలేదని కడప జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నెల 24 నుంచి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో సిట్ సీఎం సమీప బంధువులను పిలిపించి ప్రశ్నించటం సంచలనం సృష్టించింది. గతంలో భాస్కరరెడ్డిని పులివెందుల్లోనే ఒకసారి ప్రశ్నించారు. ఇప్పుడు కడపకు పిలిపించి రహస్య ప్రాంతంలో విచారణ జరిపినట్లు తెలిసింది. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 15న పులివెందుల లోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును చేధించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా టెక్నికల్ టీం, ఫీడ్ టీం, డాక్యుమెంటరీ సేకరణ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీంలను నియమించారు. అప్పట్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 26న నాటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమించారు. మహంతి ఆధ్వర్యంలోనే వివేక హత్య కేసును సిట్ బృందం దర్యాప్తు చేసింది. మే 30 న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగానే సిట్ కు నాయకత్వం వహిస్తున్న ఎస్పీ మహంతి నెలన్నర క్రితం దీర్ఘ కాలిక సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.