సూర్యుడు ఎంతసేపు ఉంటే అంత ఆరోగ్యం

 

మన పూర్వీకులు సూర్యుని ప్రత్యక్ష దైవంగా భావించేవారు. ఇప్పటికీ సూర్యడు అంటే హిందువులకు భగవానుడే. ఆయన లేకుండా సృష్టిలోని జీవకోటి మనుగడ లేదన్న విషయం తెలిసిందే! కానీ సూర్యుడు ఆకాశంలో ఎంతసేపు ఉంటే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారన్న విషయం తెలుసా...

 

ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి:

మార్క్‌ బీచర్‌, లారెన్స్‌ రీస్‌, డెనిస్‌ ఎగెట్‌ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి సూర్యకాంతి మీద ఓ పరిశోధన చేశారు. ఇందులో ఒకరు తన దగ్గరకి మానసిక సమస్యలతో వచ్చే రోగులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒక్క చోటకి చేర్చారు. మరొకరు వాతావరణానికి సంబంధించిన గణాంకాలన్నీ సేకరించారు. ఇంకొకరు ఈ రెంటికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించారు.

 

అందరి మీదా ప్రభావం:

కొంతమంది చలికాలంలో మాత్రమే డిప్రెషన్‌కి లోనయ్యే జబ్బుతో బాధపడుతూ ఉంటారు. దీనిని Seasonal affective disorder (SAD) అంటారు. చలికాలంలో సూర్యకాంతిలో మార్పు రావడం వల్ల మన శరీరంలోని సెరిటోనిన్‌, మెలటోనిన్‌ అనే హార్మోనుల ఉత్పత్తిలో మార్పు వస్తుంది. ఫలితంగా కొందరు SAD బారిన పడతారు. కానీ తాజా పరిశోధనతో తేలిందేమిటంటే పగటివేళలు తగ్గడం అనేది మనలో ప్రతి ఒక్కరి మీదా ఎంతో కొంత ప్రభావం చూపుతుందట.

 

వేళలే ముఖ్యం:

సూర్యుడు ఎంత తీక్షణంగా ఉన్నాడన్నది ముఖ్యం కాదని ఈ పరిశోధనతో తేలింది. కాలుష్యం కారణంగానో, ఆకాశం మేఘావృతంగా ఉండటం చేతనో సూర్యుడు పెద్దగా కనిపించపోయినా ఫర్వాలేదు కానీ... సూర్యుడు వీలైనంతగా ఆకాశంలో ఉండటమే ముఖ్యం అని తెలిసింది. మరో మాటలో చెప్పాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఎంత ఎక్కువ సమయం ఉంటే మనుషులు అంత సంతోషంగా ఉన్నారట. సూర్యకిరణాలు భూమిని ఎంత ఎక్కువసేపు తాకితే మన మానసిక ఆరోగ్యం అంత బాగా ఉంటుందట.

 

కారణం!

పగటివేళలకీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించైతే చెప్పారు కానీ దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం పరిశోధకులు తేల్చలేదు. బహుశా SAD రోగుల విషయంలోలాగా ఇతరులలోనూ హార్మోనుల ఉత్పత్తిలో వచ్చే మార్పులే దీనికి కారణం కావచ్చు. ఇక సూర్యరశ్మి నుంచి లభించే D విటమిన్‌లో లోపం ఏర్పడటం వల్ల కూడా మనిషి మనసులో ఇలాంటి అలజడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పగటివేళలు తక్కువగా ఉండే కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు.

- నిర్జర.