సరికొత్త ‘శంకరాభరణం’

 

అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌ సృష్టి ‘శంకరాభరణం’ సరికొత్త హంగులతో విడుదల కాబోతోంది. ‘శంకరాభరణం’ విడుదలై ఇప్పటికి 35 సంవత్సరాలు దాటుతోంది. ఈ సినిమాని డిజిటలైజ్ చేసి, సరికొత్త సౌండ్ ‌సిస్టమ్‌తో మ్యూజిక్‌ని సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి, అంతకుముందు 35 ఎంఎంలో వున్న సినిమాని సినిమా స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా కొత్త ఫార్మాట్‌లో చేశారు. ‘శంకరాభరణం’ సినిమాని నేటి సాంకేతిక సదుపాయాలకు అనుగుణంగా మార్చడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఒక కళాఖండమైన ఈ సినిమా ఇప్పుడు సాంకేతికంగా కూడా నేటి తరం కూడా ఇష్టపడేలా వుంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాని తమిళనాడులో విడుదల చేయబోతున్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాడులో సిల్వర్ జూబ్లీ ఆడింది. ఏడిద నాగేశ్వరరావు ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.