ఆంధ్రాలో ఉద్రుతమవుతున్న ఉద్యమాలు

 

కేంద్రం తెలంగాణా ప్రకటన చేసి నేటికి మూడవరోజు. క్రమంగా సీమంధ్ర జిల్లాలంతటా కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉద్రుతమవుతూ పలు చోట్ల హింసాయుతంగా మారుతున్నాయి. అనేక జిల్లాలో ఉద్యమకారులు ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలు విధ్వసం చేస్తున్నారు. ఇంతవరకు వివిధ ప్రాంతాలలో దాదాపు 15-20 విగ్రహాలు ఉద్యమకారుల చేతిలో విద్వంసమయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పోలీసులు విద్వంసానికి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసారు.

 

తెలంగాణాలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తుంటే, మిగిలిన ప్రాంతాలు మాత్రం అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇటువంటి అరాచక పరిస్థితుల్లో రాష్ట్రంలో పోలీసులు, పారా మిలెటరీ బలగాలు తప్ప అసలు ప్రభుత్వం ఉనికి కానరావట్లేదు. ఇంత వరకు ముఖ్యమంత్రి గానీ, బొత్ససత్యనారాయణ గానీ, మరే ఇతర మంత్రులు గానీ బయటకి వచ్చి మీడియాతో మాట్లాడకపోవడం చాలా విచిత్రం.

 

సీమంధ్ర జిల్లాలంతటా బస్సులు డిపోలకే పరిమితమయిపోగా కొన్నిమారుమూల ప్రాంతాలలో మాత్రం యదావిధిగా తిరుగుతున్నాయి. గత మూడు రోజులుగా అన్ని జిల్లాలలో విద్యాసంస్థలు మూత పడ్డాయి. అదేవిధంగా రవాణ వ్యవస్థ స్తంబించిపోవడంతో ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు కూడా బోసిపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, యంపీలు, మంత్రులు అందరూ వరుసబెట్టి రాజీనామాలు చేస్తున్నప్పటికీ ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలు విధ్వసం మాత్రం ఆగలేదు. బహుశః ప్రజాగ్రహానికి భయపడటం వలననేమో ఉద్యమాలలో కాంగ్రెస్ నేతలెవరు కూడా చురుకుగా పాల్గొంటున్నట్లు కనబడటం లేదు.

 

తెదేపా, వైకాపాలు మాత్రం ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే, పార్టీల వారిగా ఉద్యమాలు జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో విభజనకు ఇతర పార్టీలే కారణమని నిందించడం గమనిస్తే, ఉద్యమం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్, తెదేపాలలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు రెండు పార్టీలకు చెందిన దాదాపు పదిమంది శాసనసభ్యులు రాజీనామాలు చేసారు.