కుస్తీకి "అచ్చేదిన్" తెచ్చిన సుల్తాన్

భారతదేశంలో సినిమా అనేది ఒక మతం.. తారలను తమ ఇలవేల్పులుగా పూజిస్తారు ఇక్కడి అభిమానులు. ఈ క్రమంలో వారి హావభావాలు, డ్రెస్, హెయిర్ స్టైల్ ఇలా టాప్ టూ బాటమ్ తారల్ని ఫాలో అయ్యేవారు మనలో కోకోల్లలు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే దానిలో కొత్తగా కనిపించే ఏ అంశాన్ని వదిలిపెట్టారు మన అభిమాన గణాలు. సిక్స్‌ప్యాక్, మిడిల్ క్రాఫ్, సైజ్ జీరో ఇలా తెరపై కనిపించిన ప్రతి దానిని అనుకరించేయ్యాల్సిందే. ఇప్పుడు అదే జాబితాలోకి చేరింది మల్లయుద్ధం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం సుల్తాన్. ఈ సినిమా కథాంశం మల్లయుద్థం, అందులో భాగంగానే "సుల్తాన్ అలీఖాన్" అనే మల్లయోధుడి పాత్రలో సల్మాన్ జీవించాడు.

 

ఇంకేముంది అభిమానులకు మల్లవిద్య అనే కొత్త కాన్సెప్ట్ దొరికింది..వెంటనే ఆలస్యం చేయకుండా మల్లవిద్య నేర్పించే అకాడమీలు ఎక్కడున్నాయో అక్కడికి పరుగులు తీశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న క్రీడల్లో మల్లయుద్థం లేదా కుస్తీ ఒకటి..దీని ప్రస్తావన రామాయణ, భారతాల్లో ఉంది..భీముడు మల్లయుద్థంలో సిద్ధహస్తుడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతోనే ఎదుటి వ్యక్తిని మట్టికరిపించడం కుస్తీ ప్రత్యేకత. ఆ రోజుల్లో మల్లయోధులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. రాజులు ప్రత్యేకంగా కుస్తీ వీరులను పెంచిపోషించేవారు. ఒక రాజ్య సంపదను, కీర్తిని అక్కడ ఉన్న మల్లయోధుల సంఖ్యను, వారు సాధించిన విజయాలను బట్టి నిర్ణయించే ఆనవాయితీ కూడా అమల్లో ఉండేది. కుస్తీకి లభిస్తోన్న ఆదరణ కారణంగా ఎంతోమంది మల్లయోధులు దీనిని ఒక వృత్తిగా స్వీకరించి, పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బును కూడా బాగానే ఆర్జించారు.

 

ఆధునిక పోకడల కారణంగా క్రమేపీ కుస్తీకి ఆదరణ కరువైంది. తెలుగు రాష్ట్రాల్లో కుస్తీలు అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ పాతబస్తీ. నిజాం నవాబుల కాలంలోనూ తరువాత కూడా అనేక వ్యాయామశాలలతో పాతనగరం కళకళలాడుతుండేది. మల్లవిద్య అంత సులువైన విషయం కాదు. ఇందులో ఆరి తేరాలంటే శరీరాన్ని ఎంతో కష్టపెట్టాల్సి ఉంటుంది. ఉదయం నాలుగు గంటల నుంచి వస్తాదుల పర్యవేక్షణలో ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఆధునిక జిమ్‌లతో పోల్చి చూస్తే సాంప్రదాయ పద్థతుల్లో చేసే వ్యాయామాలకు చాలా వ్యత్యాసం ఉంది. బైఠక్, దండ్, హనుమాన్ బైఠక్, సపాట్, మట్టిలో నడవడం, బరువులు ఎత్తడం వంటివి శరీరానికి ఎంతో ప్రయోజనాన్నిస్తాయి. సుల్తాన్ సినిమా ప్రభావంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు సైతం వ్యాయామశాలలకు పరుగులు తీస్తుండటంతో మళ్లీ శంషాబాద్, పాతబస్తీల్లో ఉన్న సాంప్రదాయ వ్యాయామశాలలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.