వన్డేల్లో ఆగిన పరుగులయంత్రం

 

క్రికెట్ నే శ్వాసించి జీవించే కోట్లాది క్రికెట్ అభిమానుల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరిక మైదానంలో వారికి దర్శనం ఈయబోనని చెప్పి హట్టాత్తుగా మాయమయిపోనున్నాడు. 23 సం.లు పాటు నిర్విరామంగా పనిచేసి 18,468 పరుగులు సృష్టించి ప్రపంచంలో తనకి మరే యంత్రం సాటిరాదని నిరూపించిన పరుగులయంత్రం తనకీ ఇక విశ్రాంతి కావాలని సవినయంగా విన్నవించుకొని శాశ్వితంగా ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ భారత క్రికెట్ రారాజు సచిన్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు (ఆదివారం) ప్రకటించేడు.

 

త్వరలో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ వన్-డే సిరీస్ లో తన విశ్వరూపం చూపించి దాయదులను కట్టడిచేస్తుంటే చూడాలనుకొంటున్న కోట్లాది అభిమానులను తీవ్రనిరాశకు గురిచేస్తూ, సరిగ్గా 23సం.ల క్రితం ఏ పాకిస్తాన్ టీమ్ తో ‘ఆడుకొని’ తన సుదీర్ఘ క్రికెట్ యాత్రని ప్రారంభించేడో, నేడు అదే టీముతో ఆడాల్సిన తరుణంలో సచిన్ టెండూల్కర్ వన్-డే పోటీలనుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. చివరికి, సెలక్టర్లు కూడా అతను తన నిర్ణయాన్ని ప్రకటించిన సమయం (టైమింగ్) చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏమయినప్పటికీ, క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ మరిక వన్డే క్రికెట్ లో మనకిక కనిపించబోడు.

 

తన నిర్ణయం ప్రకటిస్తూ సచిన్ టెండూల్కర్ ఇంతవరకు తనను తన ఆటను ఆదరించి గౌరవించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, 2015 సం.లో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలకు సరయిన జట్టుకూర్పు ఏర్పడేందుకు వీలుకల్పించాలనే ఆలోచనతోనే తానూ తప్పుకొంటున్నట్లు ప్రకటించి హుందాగా జంటిల్ మ్యాన్ తప్పుకొన్నాడు. అయితే, గత కొంతకాలంగా తన పేలవమయిన ఆటతీరుతో ఇబ్బందిపడుతున్న సచిన్ టెండూల్కర్ కు తన రిటైర్మెంటు కోసం మీడియాలో జరుగుతున్నరగడ చూసి భాధతోనే క్రికెట్ నుండి హటాత్తుగా నిష్క్రమిస్తున్నట్లు అర్ధమవుతుంది.

 

అతని నిష్క్రమణ మంచిదా, కాదా అనే విషయాన్ని పక్కన పెడితే అతను భారత క్రికెట్ కు చేసిన సేవలు మరువరానివి. భారత క్రికెట్ టీం కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన వారిలో అతనూ ఒక్కడు. సచిన్ టెండూల్కర్ అంటే భారతీయ క్రికెట్టుకి ప్రతిరూపం. భారతీయ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ అని క్రికెట్ ప్రేమికులు బావించడం అతనిపట్ల వారికున్న ప్రేమాభిమానాలకు ఒక నిదర్శనమయితే, వారు ఆవిధంగా అనుకొనే విదంగా ఆటలో జీవించిన ఘనత టెండూల్కర్ ది.

 

1989 వ సం.లో పాకిస్థానుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించిన సచిన్ టెండూల్కర్ తన 23 సం.ల కెరీర్‌లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలతో అనితర సాద్యమయిన విదంగా 18, 428 పరుగుల్ని సాధించాడు. అంతే గాకుండా, తన జీవితాశయమయిన భారత్ దేశానికి ప్రపంచకప్ కూడా సాదించి నిష్క్రమిస్తున్నాడు.

 

అతను సాదించిన ఘన విజయాల వివరాలన్నిటినీ ఔపోసనపట్టిన క్రికెట్ ప్రేమికులకి మళ్ళీ ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. వివరించదలిస్తే అది ఒక మహాగ్రందం అవుతుందని అందరికీ తెలుసు. సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కు అందించిన సేవలకు భారత ప్రభుత్వం అతనిని పద్మవిభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది. అతనికి దక్కిన అరుదయిన మరో గౌరవం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన గ్రూప్ కెప్టెన్ హోదాతో గౌరవించడం. కొద్దికాలం క్రితం మైసూర్ విశ్వవిద్యాలయం వారు అతనికి గౌరవడాక్టరేట్ తో గౌరవించేరు. భారత ప్రభుత్వం కూడా అతని విశిష్ట సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి క్రికెట్ ప్రేమికులను సంతోషపరిచింది. అయితే కోట్లాది అభిమానుల కోరిక ‘భారత రత్న’ మాత్రం ఇంకా సాకారం కాక పోవడం వారికి విచారం కలిగిస్తోంది. అది అతనికి ఎంత గౌరవం కలిగిస్తుందో, డాన్ బ్రాడ్ మన్ లాంటి క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచిన సచిన్ వల్ల కూడా ఆ బిరుదుకు అంతే వన్నె పెరుగుతుంది.

 

సచిన్ టెండూల్కర్ను కేవలం ఒక క్రికెట్ ఆటగాడిగా మాత్రమే గాకుండా, అతనిని భారత క్రీడా రాయభారిగా కూడా ప్రపంచం భావిస్తుంది. అందుకు, అతని విశిష్టమయిన ఆట ఒక్కటే కారణం మాత్రo కాదు. అతని విశితమయిన వ్యక్తిత్వం కూడా అందుకు ఒక కారణమని చెప్పవచ్చును. అతను క్రికెట్ ఆటను ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా తన దేశాన్ని, తన ప్రజలను ప్రేమిస్తాడు. నిత్యం ప్రపంచం దేశాలు చుట్టి వచ్చే అతనికి భారత దేశంలో అడుగుపెట్టినప్పుడే సంపూర్ణమయిన ఆనందం అనుభూతి చెందుతానని చెప్పడమే అతని భారతీయ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

 

ప్రపంచ దేశాల నడుమ తన మువ్వనెల భారతీయ పతాకం టీవిగా రెపరెపలాడుతూ నిలిపిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిష్క్రమణతో భారతీయ క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ముగిసింది. ఇక, భారతీయ క్రికెట్ చరిత్రలో సచిన్ కి ముందు, సచిన్ కి తరువాత అని రెండు శకాలుగా మనం ప్రస్తావించుకోక తప్పదు.