పసివాళ్ళ ఉసురు తీస్తోన్న ఇంటర్నేషనల్ స్కూల్స్

ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో విద్యను అందిస్తామని చెప్పి...విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజే ఇంటర్నేషనల్ స్కూళ్లలో రక్షణ ఉండటం లేదని మరోసారి రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉండే గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. నగరంలోని ర్యాన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌‌లో 2వ తరగతి చదువుతున్న చిన్నారిని అత్యంత పాశవికంగా చంపి వేశారు. ఇవాళ ఉదయం టాయ్‌లెట్‌‌కు వెళ్లిన విద్యార్థులకు రక్తపు మడుగులో ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలియజేశారు. యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కత్తితో గొంతు కోసినట్లు నిర్థారించారు..

 

రోజులాగే తండ్రి ఉదయాన్నే ఆ చిన్నారిని స్కూల్ వద్ద దింపి ఇంటికి చేరుకోగానే ఒక వార్త వారి చెవిన పడింది. దీంతో తల్లిదండ్రులు పరుగు పరుగున స్కూల్ వద్దకు చేరుకుని షాక్‌కు గురయ్యారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే స్కూలు యాజమాన్యం అసలు విషయం దాచి మీ అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడని..అతన్ని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని సమాచారం అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

ఏడాది క్రితం ఇదే స్కూలుకు చెందిన వసంత్‌కుంజ్ బ్రాంచ్‌లో దివ్యాంశ్ అనే ఆరేళ్ల చిన్నారి వాటర్ రిజర్వాయర్‌లో పడి మరణించడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో విద్యార్థుల భద్రతకు అమలు చేస్తోన్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ యాజమాన్యాలను ఆదేశించింది. ఇంత జరిగినా సదరు పాఠశాలలు మొద్దునిద్ర వదలడం లేదు. స్కూలు యాజమాన్యాల నిర్లక్ష్యమే తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. మరోవైపు మరణించిన చిన్నారి సోదరి కూడా ఇదే ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఇటువంటి పేరు గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫీజులపైనే కాకుండా విద్యార్థుల రక్షణపైనా దృష్టి పెడితే ఇటువంటి దారుణాలు జరక్కుండా ఉంటాయి.