ధాన్యం తరలింపునకు బినామీ కాంట్రాక్టర్ల రింగ్?
posted on Sep 23, 2012 4:07PM
వరంగల్ జిల్లాలో అన్ని పనులకూ చేతివాటం అలవాటైంది. అధికార్ల చేతివాటాన్ని ఆసరా చేసుకుని ధాన్యం తరలింపునకు పిలిచిన కాంట్రాక్టుల్లోనూ కొందరు బినామీలు రింగయ్యారు. లేకపోతే వరంగల్ జిల్లాలో ఉన్న తొమ్మిది సెక్టార్లకు 40టెండర్‌షెడ్యూల్సు అమ్ముడుపోయాయి. వాటికి 30మంది దాఖలు చేసుకున్నారు. వరంగల్`1 సెక్టారుకు రెండు, వరంగల్`2కు 3, జనగామ`1కి మూడు, జనగామ`2కి నాలుగు, మహబూబాబాద్`1కి ఐదు, మహబూబాబాద్`2కు రెండు, నర్సంపేటకు ఆరు, ములుగు`1కి మూడు, ములుగు`2కి రెండు టెండర్లు షెడ్యూలు దాఖలయ్యాయి. ఒకే వ్యక్తి 9సెక్టార్ల పరిధిలో 14మండలాలకు బినామీ పేర్లతో టెండరు షెడ్యూలు దాఖలు చేశారని కొందరు కాంట్రాక్టర్లు బయటపెట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50టన్నుల సవరిత వాహనాల్లో ఉన్న వారే టెండర్లు వేయాల్సి ఉంటే దానికీ మినహాయింపు ఇచ్చారని సమాచారం. ఇలా బినామీ కాంట్రాక్టర్లతో ధాన్యం తరలింపునకు అధికారులు ఆమోదం లభిస్తోంది. కొందరు ప్రజాపంపిణీ వ్యవస్థలో తినమరిగిన వారే ఈ కాంట్రాక్టులకు బినామీలను ఉపయోగించుకుంటున్నారని సమాచారం. అధికారులు మాత్రం ఎటువంటి అక్రమాలు జరగటం లేదని షెడ్యూలు ఖరారు చేసేస్తున్నారు. పలురకాల ఆరోపణలతో ఈ విషయం రాష్ట్రస్థాయి అధికారులకి తెలిసినా బే ఫికర్ అంటున్నారు.