రేవంత్ విదేశ యాత్ర.. బీఆర్ఎస్‌లో లేనిపోని ఆత్రుత!
posted on Aug 3, 2024 1:48PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటనకు బయల్దేరారు. ఆగస్టు 14 వరకూ సీఎం పర్యటన కొనసాగనుంది. ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా విదేశాలకు వెళ్ళారు. ఆగస్టు 5వ తేదీన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్తారు. శనివారం (03-8-24) నుండి 9 వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ , శాన్ ప్రాన్సిస్కో నగరాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అమెరికాలోని పలువురు వ్యాపారవేత్తలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం శనివారం నేరుగా న్యూయార్క్ వెళ్లనుంది. 4వ తేదీన న్యూజెర్సీలో ఒక కార్యక్రమం జరగనుంది. 5వ తేదీన న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు. 10న అమెరికాలో బయల్దేరి రేవంత్‌రెడ్డి బృందం దక్షిణ కొరియాకి వెళ్ళనుంది. దక్షిణ కొరియాలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డి బృందం ఈనెల 14న తిరిగి వస్తుంది. ఈ పర్యటన సంగతి ఇలా వుంటే, రేవంత్ రెడ్డి విదేశాల్లో వున్న కాలంలో రాజకీయంగా ఏదైనా హడావిడి చేసి రేవంత్ రెడ్డి సీటు కిందకి నీళ్ళు వచ్చేలా చేసే అవకాశం ఏదైనా వుందా అని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.